కాల్చేస్తున్న కూల్ లిప్!
క్లాస్ రూమ్‌లోనే..
స్కూల్ బ్యాగుల్లో కూల్ లిప్ ప్యాకెట్లు
చిత్తూరు కలెక్టరేట్ : పాఠశాల స్థాయి విద్యార్థుల బ్యాగుల్లో, జేబుల్లో కూల్ లిప్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. ఏమిటి ఈ కూల్ లిప్ అనుకుంటున్నారా.. పొగలేకుండా పసిపిల్లల భవిష్యత్‌ను కాల్చేసే మత్తు పదార్థం. చిత్తూరు నగరంలోని గాండ్లపల్లి, కట్టమంచి, గిరింపేట, సంతపేటలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు ఈ కూల్ లిప్ మత్తుకు బానిసలవుతున్నారు. చిత్తూరు జిల్లా కేంద్రం తమిళనాడుకు సరిహద్దుగా ఉండడంతో అక్కడి నుంచి అక్రమంగా వీటిని జిల్లాలోకి తరలిస్తున్నారు. ఈ ప్యాకెట్లకు అలవాటు పడ్డ విద్యార్థులు మత్తుకు బానిసవుతున్నారు. కూల్ లిప్ సేకరించి మత్తులోనే తరగతులకు వస్తున్నారని టీచర్లు ఆవేదన చెందుతున్నారు. నిషేధం అయినప్పటికి చిత్తూరు జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల్లో కూల్‌లిప్ అందుబాటులో ఉండడం విమర్శలకు తావిస్తోంది.
మత్తుకు బానిసలు కావొద్దు
విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని డీవైఈవో ఇందిర సూచించారు. గాండ్లపల్లి నగరపాలక పాఠశాలను తనిఖీ చేసిన ఆమె విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. టీచర్లు నిత్యం విద్యార్థుల నడవడికలపై ప్రత్యేక దృష్టి వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు సెల్వరాజ్, మోహన్, ఎకై ్సజ్ ఎస్‌ఐ మోహన్‌కృష్ణ, పీహెచ్‌సీ డాక్టర్ దయాసాగర్, హెచ్‌ఎం గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్లాస్ రూమ్‌లోనే మత్తు వేషాలు వేస్తున్నారని టీచర్లు ఆరోపిస్తున్నారు. తరగతికి రాగానే నిద్రపోతున్నారని వెల్లడిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా ఉన్నారని టీచర్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. విద్యార్థుల బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా కూల్ లిప్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. వీటిని ఉన్నతాధికారులకు తెలియజేయగా పోలీసుల సహాయంతో కూల్ లిప్‌ల గురించి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న గాండ్లపల్లి నగరపాలక పాఠశాలలో కూల్ లిప్ లు దొరకడంతో విద్యాశాఖ, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, డీవైఈవో ఇందిరా, ఎంఈవోలు సెల్వరాజ్, మోహన్‌లు మురుగానపల్లి పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాల ఆవరణలో కూల్ లిప్ ప్యాకెట్‌లను గుర్తించారు. కూల్ లిప్‌లను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు.


