మట్టి..గుట్ట స్వాహా!
గుట్టలో మామిడి మొక్కలు పెట్టిన దృశ్యం
చదును చేస్తున్న గుట్ట భూమి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం, బండపల్లి రెవెన్యూలోని 194.వెంకటాపురం గ్రామంలో గుట్ట భూమి ఆక్రమణకు గురవుతోంది. తన పొలం పక్కన ఉందని..టీడీపీకి చెందిన ఓ వ్యక్తి గుట్టపై కన్నేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చే సరికి.. జేసీబీలతో రంగంలోకి దిగాడు. పంట పొలాలకు మట్టి తోలుతున్నానని ఊరు జనాన్ని నమ్మించాడు. రోజుకు వందల ట్రాక్టర్లు.. మట్టి తరలిస్తున్నాయి. ఈ మట్టి ఎక్కడికి వెళుతోందని ఊరు జనం ఓ లుక్కేశారు. ఒక ట్రాక్టర్ మట్టిని రూ.1000 లెక్కన చిత్తూరు నగరానికి తరలిస్తూ..సొమ్ము చేసుకుంటున్నాడనే విషయాన్ని తెలుసుకున్నారు. ఒక రోజుకు సుమారు 100 లోడ్లకు రూ.లక్ష సంపాదిస్తున్నట్లు లెక్కగట్టారు. ట్రాక్టర్ బాడుగ, జేసీబీ ఖర్చు పోను చేతికి రూ. 50 వేలు మిగులుతుందనే విషయాన్ని గుర్తుపట్టారు. ఇలా 15 రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్దామనే లోపు..మట్టి కొట్టు..గుట్ట పట్టు కథ బయటపడింది.
చదును చేస్తూ..ఆక్రమిస్తూ..!
మట్టేకదా అని చూస్తే.. ఆరు ఎకరాల గుట్ట భూమి మాయమవుతోంది. టీడీపీకి చెందిన ఓ వ్యక్తి గుట్టలో గుట్టు చప్పుడు కాకుండా ఆరు ఎకరాల భూమిని చదును చేసేశారు. ఓ వైపు మట్టి అమ్ముకుంటూ.. మరో వైపు ఎకరాల కొద్దీ భూమిని ఆక్రమించుకుంటూ.. ఇంకో వైపు మామిడి మొక్కలు నాటుకుంటూ వస్తున్నారు. ఇలా ఆరు ఎకరాల వరకు ఆక్రమించేశారు. ఇదేమని ప్రశ్నించిన వారి వద్ద పట్టా ఉందని సాకులు చెబుతున్నాడు. ఒక వేళ పట్టా ఉంటే.. ఎకరా భూమికి మాత్రమే పట్టా ఉంటుందని గ్రామస్తులు చెన్నమ్మ (గ్రామదేవత) సాక్షిగా ఒట్టేసి చెబుతున్నారు. ఈ బాగోతం ఓ ద్వితీయ శ్రేణి అధికారికి తెలిసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
అమ్మా..దీనికి వెనుక పవర్ ఉందమ్మా!
మట్టి దోపిడీ నుంచి.. ఆరు ఎకరాల ఆక్రమణ వరకు రెవెన్యూలో ఓ ద్వితీయ శ్రేణి అధికారి పవర్ పనిచేస్తోందని ఊరంతా కోడైకూస్తోంది. ఆక్రమణ దారుల వెంట.. ఆ పవర్ కరెంట్ తీగలా అల్లుకుపోయిందని చర్చించుకుంటున్నారు. ముందుపడి ఫిర్యాదు చేస్తే.. ఆ పవర్.. షాక్ కొట్టేలా చేస్తోందని చెబుతున్నారు. ఆక్రమణను అమ్మ వరకు చేరనివ్వకుండా ఆ పవర్ అడ్డుపడుతోందని అంటున్నారు. ఇది వరకే ఓ సారి ఫిర్యాదు వస్తే.. పట్టా ఉందని..ౖపైపెకి తేలుసుకున్నారనే విషయాన్ని గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. ఆక్రమణపై కన్నేసి.. వెనుక పవర్‌కు కోత విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ కల్యాణిని వివరణ కోరగా.. చదును పనులను ఆపేశాం. పట్టా ఉందని చెబుతున్నారు. గతంలో ఓ సారి కూడా పట్టా తీసుకురమ్మని చెప్పాం. ఇంత వరకు రాలేదు. ఇప్పుడు తెస్తే..రికార్డులను చూస్తాం. పరిశీలించిన తర్వాత ఆక్రమణ..అవునా..కాదా..? అనే విషయం తెలుస్తుందని వివరణ ఇచ్చుకున్నారు.
మట్టి..గుట్ట స్వాహా!


