ఇలాగైతే ‘టెండర్లు’ ఎందుకో?
చిత్తూరు అర్బన్: ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, సదుపాయాల కల్పనలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిందే. ఇదే సమయంలో అభివృద్ధి పనులు చేయడానికి నిర్ణీత నిబంధనలతో ముందుకు వెళ్లాలే తప్ప.. నలుగురు తప్పుబట్టేలా కాదు. ఈ విషయాన్ని మరచిపోయిన చిత్తూరు మునిసిపల్ అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి పనులను చేయించడంలో టెండర్లు అనే విధానం ఉందని కూడా మరిచిపోతున్నారు. రోడ్లు, కాలువ పనులను ముందుగానే టీడీపీ నేతలకు ఇచ్చేయడం.. ఆపై టెండర్లు పిలవడం అధికారులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో అరకోటికి పైగా అభివృద్ధి పనులు చేయడానికి కార్పొరేషన్ అధికారులు టెండర్లు పిలిచారు. దరఖాస్తు చేయడానికి గురువారం సాయంత్రం 5 గంటల వరకు సమయం కూడా ఉంది. కానీ ఆ పనులను అధికారపార్టీ నేతలు ఎప్పుడో పూర్తి చేశారు. ఈ మాత్రం దానికి మరి టెండర్లు పిలవడం ఎందుకో?.
అత్యవసరం మేరకు
కొన్నిచోట్ల కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటించినపుడు ప్రజలకు వెంటనే మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో పనులు చేయించాల్సి వస్తోంది. అన్ని టెండర్లలో ఇలా చేయడం లేదు. ఇక నుంచి టెండర్లు పిలిచాకే పనులు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెబుతాం.
– వెంకటరామిరెడ్డి, ఇన్‌చార్జ్ కమిషనర్,
చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్
టెండర్లు పిలవొద్దు
అభివృద్ధి పనులకు మేము అడ్డుకాదు. కానీ ఏదైనా ఓ పద్ధతిలో జరగాలి. టెండర్లు లేకుండా అసలు పనులు ఎలా చేస్తారు. ఆ మాత్రం దానికి టెండర్లు పిలవకుండా మీ పార్టీ కార్యకర్తలకు పనులు అప్పగించుకోండి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతులను ఏ ఒక్కరూ హర్షించరు.
–ఎంసి.విజయానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, చిత్తూరు
సాక్ష్యాలు ఇవే.. కాదంటారా?
చిత్తూరులోని గంగాసాగరం వద్ద రూ.7.05 లక్షలతో కాలువ నిర్మించడానికి అధికారులు ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచారు. కానీ క్షేత్ర స్థాయిలో వెళ్లి చూస్తే.. కాలువ ఎప్పుడో కట్టేశారు. అసలు కాలువ పొడవు ఎంత..? పనులు ఎవరు పర్యవేక్షించారు? ఇసుకలో సిమెంటు ఎంత కలిపారు..? లాంటి ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు.
చిత్తూరు నగరంలోని నాయుడు బిల్డింగ్స్‌లో రూ.7.43 లక్షలకు రోడ్డు వేయాలని, ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్లు గురువారం సాయంత్రంలోపు టెండరు వేసుకోవాలని కార్పొరేషన్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. నాయుడు బిల్డింగ్స్ వద్ద వెళ్లి చూస్తే.. ఇప్పుడిప్పుడే వేసిన రోడ్డు కనిపిస్తోంది. ఎన్ని రోజుల్లో రోడ్డు వేశారు..? క్యూరింగ్ ఎప్పుడు చేశారు..? నాణ్యత పరిస్థితి ఏమిటి..? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రశాంత్ నగర్ వద్ద కూడా ఇదే పరిస్థితి. రూ.8.35 లక్షల పనులను ఎప్పుడో పూర్తి చేసేస్తే.. ఇప్పుడు టెండరు పిలిచారు. అసలు ఇది ఎన్నాళ్ల ముందు నిర్మించిన కాలువ..? గతంలో బిల్లులు ఇచ్చిన కాలువకు.. ఇప్పుడు తప్పుడు బిల్లులు పెడుతున్నారా..? ఏదీ అర్థం కావడం లేదు.
ఇలాగైతే ‘టెండర్లు’ ఎందుకో?
ఇలాగైతే ‘టెండర్లు’ ఎందుకో?


