కర్షకుల కడుపు కొట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

కర్షకుల కడుపు కొట్టొద్దు

Jan 8 2026 7:05 AM | Updated on Jan 8 2026 7:05 AM

కర్షకుల కడుపు కొట్టొద్దు

కర్షకుల కడుపు కొట్టొద్దు

● జిల్లాలో మామిడి రైతుల ఆక్రందన ● గిట్టుబాటు కాని మామిడి ధరలు ● పాలకుల తీరుపై మండిపాటు ● కొందరు రైతు నాయకులు లోపాయికారి ఒప్పందంపై తిరుగుబాటు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో మామిడి రైతులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై పెదవి విరుస్తున్నారు. కేజీకి రూ.9 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద గిట్టుబాటు ధర పోరును ఉధృతం చేస్తున్నారు. బుధవారం జీడీ నెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీని ముట్టడించారు.

గతేడాది పండిన మామిడి పంటను రైతులు అష్టకష్టాల నడుమ విక్రయించుకున్నారు. 31 పల్ఫ్‌ ఫ్యాక్టరీలకు కాయలు తరలించగా.. సుమారు రూ.360 కోట్లు వరకు రైతులకు బకాయిలున్నాయి. ఆరు నెలలుగా పలు ఫ్యాక్టరీలు ఆ బిల్లులు చెల్లించకపోగా.. కొన్ని ఫ్యాక్టరీలు రూ.3, రూ.4 చెల్లించేందుకు ముందుకొస్తున్నాయి. దీనిపై రైతులు మండిపాటుకు గురవుతున్నారు. ప్రభుత్వ ప్రకటించిన మద్ధతు ధర ప్రకారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కేజీకి రూ.8 కాదు..రూ.9 ఇవ్వాలి

చంద్రబాబు సర్కార్‌ కేజీకి రూ.8 ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకో లేదు. దీంతో రైతులు ఫ్యాక్టరీలను ముట్టడిస్తున్నారు. ధర్నాలు చేస్తూ..రోడెక్కుతున్నారు. పలు ఫ్యాక్టరీలకు తాళం వేస్తూ..వారి ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ప్రకటించిన.. కేజీకి రూ.8తో పాటు ఆరునెలల పాటు జాప్యానికి బదులుగా మరో రూ.1 అదనంగా ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొంత మంది మామిడి రైతు నాయకులు ఫ్యాక్టరీలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫ్యాక్టరీలతో లాలూచీ?

కొందరు మామిడి రైతు నాయకులు ఫ్యాక్టరీలతో లాలూచీ పడ్డారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేజీకి రూ.8 బదులుగా.. రూ.6 ఇవ్వండి అంటూ.. ముందుపడడంతో అధిక శాతం మంది రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. రూ.6 అనే మాటే వద్దని భీష్మిస్తున్నారు. ఇది కూడా పాలకుల సిండికేట్‌ దెబ్బే అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

సంక్రాంతికి ఇవ్వకుంటే!

ఫ్యాక్టరీలు సంక్రాంతికి కల్లా రైతులకు నగదు చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే ఈనెల 14వ తేదీ మళ్లీ మామిడి రైతుల పోరు ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ఆపై నిరవధిక సమ్మె ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రైతులను పోలీసుల ద్వారా అడ్డుకుని నోరు మూయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement