విద్యార్థినిని చితక్కొట్టిన ఉపాధ్యాయురాలు
పుత్తూరు: అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదన్న కోపంతో సహనం కోల్పోయిన ఉపాధ్యాయురాలు తీవ్రంగా కొట్టడంతో ఓ విద్యార్థిని స్ఫృహతప్పి పడిపోయింది. ఈ ఘటన పుత్తూరు జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. సోషల్ టీచర్ రాజేశ్వరి మ్యాప్ పాయింట్‌పై మణిదీపిక అనే విద్యార్థినిని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో నియంత్రణ కోల్పోయిన టీచర్ మణిదీపికను గట్టిగా కొట్టింది. దీంతో విద్యార్థిని స్ఫృహతప్పి కిందపడిపోయింది. సహచర విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మణిదీపిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా విద్యార్థిని తల్లి భవాని ఆస్పత్రికి చేరుకుని చదువు చెప్పమంటే ఇంతలా కొడతారా అని పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రధానోపాధ్యాయురాలు భువనేశ్వరి హామీ ఇచ్చారు.
ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు
పాఠశాలలో జరిగిన ఉదతంపై వివరణ కోరుతూ సోషల్ టీచర్ రాజేశ్వరికి పుత్తూరు డీవైఈవో మహేశ్వరరావు బుధవారం షోకాజ్ నోటీసు జారీచేశారు. విద్యార్థి ఆస్పత్రిలో చేర్పించే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలపాలని నోటీసులో పేర్కొన్నారు.


