రూ.63 లక్షల విలువైన ఫోన్ల అప్పగింత
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసులు దాదాపు రూ.63 లక్షల విలువ చేసే 315 సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించారు. మంగళవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తుషార్ డూడి వివరాలను వెల్లడించారు. ఫోన్లను పోగొట్టుకున్న వాళ్లు, చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితులు వాటి వివరాలను పోలీసు శాఖకు వాట్సాప్‌లో ఫోన్–9440900004 అనే నంబర్‌కు హాయ్ అని పెట్టడం, సీఈఐఆర్ అనే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా ఫోన్లను కనిపెట్టి.. అప్పగించడానికి చర్యలు తీసుకున్నట్టు వివరించారు. జిల్లాలో వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తుచేసి బాధితుల వద్ద ఉన్న వివరాల ఆధారంగా ఫోన్లను దేశంలోని ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర లాంటి పలు రాష్ట్రాల నుంచి తెప్పించినట్టు వెల్లడించారు. ఇందుకోసం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఐటీ విభాగం పనిచేస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 13 విడతల్లో 4,106 సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించినట్టు పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు రూ.8.55 కోట్లు ఉంటుందన్నారు. సెల్‌ఫోన్లను రికవరీ చేసిన సీసీఎస్ సీఐ ఉమామహేశ్వరరావు, సిబ్బంది బాపూజీ, రఘురామ్, శ్రీనివాస్ సర్టిఫికెట్లను అందచేసిన వారిని అభినందించారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ సీఐ మహేశ్వర తదితరులు పాల్గొన్నారు.


