ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన ముఖ్యం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పని మంగళవారం కేంద్ర బృందం సందర్శించింది. పది మంది కేంద్ర బృంద అధికారులు ఆస్పత్రిలో పరిశీలన చేశారు. రెండు బృందాలుగా విడిపోయి...ప్రసూతి విభాగంలోని ఆరోగ్యశ్రీ, గర్భవతుల సేవలు, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. తర్వాత గర్భవతులతో మాట్లాడారు. వారికి అందుతున్న ఆరోగ్య సేవలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంల పనితీరుపై విచారించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉన్నారో..లేదో పరీక్షించారు. అనంతరం ఓ గర్భిణి చేతిలో ఉన్న పొరకపుల్లలు, వేపాకు ఏమిటని ప్రశ్నించారు. అనంతరం డీఐసీని సందర్శించారు. పిల్లలతో మాట్లాడారు. అక్కడి సేవలను అడిగి తెలుసుకున్నారు. వీరి రాకతో ముందస్తు ప్రణాళికలు ఫలించాయి. ఇన్నాళ్లు కనిపించని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అవగాహన బోర్డులు తళుక్కుమన్నాయి. అయితే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై చాలా మందికి అవగాహన లేదని కేంద్రబృంద అధికారులు గుర్తించారు. కచ్చితంగా వారికి ఆరోగ్య కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు హరికృష్ణన్, పార్థవిథాంపీ, సీవీఎస్ రాయుడు, రామచంద్రరావు, ఎల్‌బీఎస్‌హెచ్ దేవి, సతీష్‌కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, ఎస్‌ఓ జార్జ్, డీపీఎంఓ ప్రవీణ ఉన్నారు.


