మురళీరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
● ఎదురు కేసులపై చర్చ ● పోలీసుల వైఖరిపై చట్టపరంగా ముందుకు.. ● విజయానందరెడ్డి
చిత్తూరు అర్బన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ వ్యవస్థాపకులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని చిత్తూరుకు చెందిన మురళీరెడ్డి బుధవారం కలిశారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన మురళిని వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి తాడేపల్లెకు తీసుకెళ్లి, వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు గతవారం మురళిపై చిత్తూరుకు చెందిన దాదాపు 30 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో విజయానందరెడ్డి, మురళిని తాడేపల్లెకు తీసుకెళ్లి దాడి జరిగిన తీరు, సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను చూపించారు. తదనంతరం వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు పెట్టించిన కేసులను కూడా ప్రస్తావించారు. మురళి శరీరంపై గాయాలను జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించి, పరామర్శించారు. అనంతరం మురళిపై పోలీసులు ఏఏ సెక్షన్లు పెట్టారు?, ఎదురు కేసులు పెట్టిన తీరుపై వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేత విజయానందరెడ్డితో చర్చించారు. రాష్ట్ర లీగల్ విభాగం నాయకులతో మాట్లాడి, తప్పుడు కేసులు పెట్టిన పో లీసులపై చట్టపరంగా ముందుకు వెళతామని స్ప ష్టం చేసినట్లు విజయానందరెడ్డి తెలిపారు. టీడీపీ తాటాకుచప్పుళ్లకు చిత్తూరులోని ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్త భయపడాల్సిన పనిలేదని తమ అధినేత సూచించారన్నారు. ప్రశ్నించేవారిపై దాడులు చేసుకుంటూ వెళితే.. దాన్ని ప్రతిఘటించి, ప్రజా కోర్టులో నిలబెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.


