కదలని వాహనం
కార్వేటినగరం : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జీడీ నెల్లూరు నియోజకవర్గానికి రెండు సంచార పశు వైద్య సేవ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అప్పట్లో ఈ వాహనాలు విశేషంగా సేవలందించేవి. పాడి రైతులు ఫోన్ చేస్తే సకాలంలో చేరుకుని వైద్యం అందించేవి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకొరగా పనిచేస్తున్నాయి. వారంలో రెండు రోజులు సేవలందిస్తే గొప్పగా మారింది. పశువైద్య కేంద్రాల వద్ద చెట్ల కిందకే పరిమితమవుతున్నాయి. ఇక పైలెట్ సెలవు పెడితే వాహనం కదిలే ప్రసక్తే ఉండదు. అలాగే మందుల కొరత కారణంగా పశువులకు మెరుగైన వైద్యం అందడం లేదు. వివిధ రోగాలకు మృత్యువాత పడాల్సిన దుస్థితి దాపురించింది. ఈ క్రమంలోనే సంచార పశు వైద్య సేవల వాహనాలను నూతనంగా కాంట్రాక్టు తీసుకున్న సంస్థ సైతం మూడు నెలలుగా సిబ్బందికి వేతనాలు అందించడం లేదని తెలిసింది. దీంతో సిబ్బంది సైతం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మందుల కొరత, అందుబాటులో ఉండని సిబ్బంది కారణంగా పశువులకు నాణ్యమైన వైద్యం అందడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


