సేవ మూగబోయింది
నగరి : నియోజకవర్గంలోని నగరి, పుత్తూరులో రెండు సంచార వాహనాలు ఉన్నాయి. ఒకప్పుడు వీటి ద్వారా నియోకవర్గంలోని ఐదు మండలాలల్లో ఎక్కడ పశువులు అనారోగ్యం పాలైనా వెంటనే వెళ్లి చికిత్సలందించేవారు. అవసరమైతే వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించేవారు. ప్రస్తుతం ఆ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. రెండు వాహనాలను పుత్తూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉంచారు. నగరి పశుసంవర్థక శాఖ కార్యాలయం వద్ద ఉండాల్సిన వాహనాన్ని పుత్తూరులో ఎందుకు ఉంచారో అధికారులకే తెలియాలి. పుత్తూరు సంచార వాహనం పుత్తూరు వడమాల పేట మండలాల్లో రోజూ ఒక గ్రామంలో పర్యటించాలి, అలాగే నగరి సంచార వాహనం నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లో సేవలు అందించాలి. అయితే అలా జరగడం లేదు. తమకు పాడి రైతుల నుంచి ఫోన్ వస్తే అక్కడికి వెళతామని సిబ్బంది చెబుతున్నారు. అయితే వాహనాలు మరమ్మతులకు గురై కదిలే పరిస్థితిలో లేవు. పర్యవేక్షణను జిల్లా అధికారులు పూర్తిగా విస్మరించడంతో పాడి రైతులకు సకాలంలో సేవలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


