జిల్లా సమాచారం
అలంకారప్రాయంగా సంచార పశు వైద్య సేవలు చెట్ల కిందకే పరిమితమైన వాహనాలు పిలిచినా పలకని సిబ్బంది ఇబ్బంది పడుతున్న పాడి రైతులు పట్టించుకోని అధికారులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో పాడి ఆవు లు 4.67 లక్షలు, గేదెలు 1036వరకు ఉన్నాయి. వీటి వైద్య సేవ ల నిమిత్తం 13 సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలున్నాయి. ఇందులో 13 మంది డ్రైవర్లు, 13 మంది పారావెట్, 12 మంది హెల్ప్‌ర్‌లు ఉంటారు. వీరి వెంట సంచార పశు వైద్యంకు వైద్యులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఏడాదిన్నర కాలంగా ఈవైద్య సేవలు కుంటుపడిందని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు వైద్యమే దిక్కు
పల్లెల్లోని పశు ఆరోగ్య కేంద్రాలను మధ్యాహ్నానికే మూసేస్తున్నారు. ఇక సంచార వైద్య సేవల వాహనానికి ఫోన్ చేస్తే సక్రమంగా స్పందించడం లేదు. చాలా కేసులు ఉన్నాయని సిబ్బంది తప్పించుకు తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాడి రైతులు చేసేది లేక ప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. రూ.వేల ఫీజులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు.
● చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో అప్పుడప్పుడు సంచార పశు వైద్య వాహనం కనిపిస్తోంది. ఎక్కువ సమయం చెట్ల కిందకే పరిమితమవుతోంది. ఈ వాహనం ద్వారా పూర్తి వైద్య సేవలు అందక పాడి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా జిల్లా సరిహద్దు గ్రామాల్లోని పాడి రైతులు తమ పశువులను తమిళనాడులోని ప్రైవేటు వైద్యుల వద్దకు తీసుకెళుతున్నారు.
● పూతలపట్టు నియోజకవర్గంలోని సంచార వాహనం కనిపించడమే లేదు. ఐరాల మండలంలో వాహనం ద్వారా వైద్య సేవలు అంది ఏడాదిన్నర గడుస్తోంది. దీంతో పాడి రైతులు మండల కేంద్రంలోని వైద్య శాలకు వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో ఇంటికి వచ్చి పశువులకు వైద్యం చేసేందుకు గోపాల మిత్రలను వేడుకోవాల్సి వస్తోంది. అలాగే బంగారుపాళ్యంలోని మరో వాహనం కూడా మొక్కుబడిగా సేవలు అందిస్తోంది. అరుదుగా తవణంపల్లి, యాదమరి మండలాల్లో కనిపిస్తోంది.
జిల్లా ప్రభుత్వ పశువుల ఆస్పత్రి 01
ఏరియా ఆస్పత్రులు 14
వెటర్నరీ డిస్పెన్సరీలు 68
లైవ్‌స్టాక్ యూనిట్లు 75
సంచార పశు ఆరోగ్య సేవ
వాహనాలు 13
ఆవులు, గేదెలు 4.68 లక్షలు
గొర్రెలు 5,01,947
మేకలు 2,08,149
పందులు 386


