ఇకపై ఆన్‌లైన్‌లో డ్వాక్రా రుణాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పొదుపు సంఘాల మహిళలకు అందించే రుణాల్లో అక్రమాలను అరికట్టేందుకు ఇకపై ఆన్‌లైన్‌లో డ్వాక్రా లోన్లు మంజూరు చేయనున్నారు. రుణాల పంపిణీ పారదర్శకతను పెంచేందుకు ఆన్‌లైన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు వెల్లడిస్తున్నారు. రుణాల మంజూరు, వాయిదాల చెల్లింపులను సైతం ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను స్వీకరించేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు డ్వాక్రా మహిళలు పొదుపు నగదులో సంఘం సభ్యుల తీర్మానం మేరకు రుణం తీసుకుని వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఆఫ్‌లైన్‌లోనే సాగేది. ఈ క్రమంలో పలు చోట్ల లెక్కల్లో తేడా వస్తుండడంతో ఆన్‌లైన్ విధానం తీసుకువస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. దీంతో పొదుపు లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని వెల్లడిస్తున్నారు. సీసీల ద్వారా డాక్యుమెంటేషన్ ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన 24 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమవుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఎంపీడీఓ కార్యాలయంలో తనిఖీ
గంగాధర నెల్లూరు : ఎంపీడీఓ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ రవినాయుడు శనివారం తనిఖీలు చేపట్టారు. మండలంలోని సాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఎంపీడీఓ మనోహర్‌గౌడ్‌ను ఆదేశించారు. ఏఓ లోకేష్, జీఎస్‌డబ్ల్యూ అధికారి మురుగేషన్ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుతుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 78,733 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,146 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
ఐసర్‌లో ఆకట్టుకున్న
‘విరాసత్’ సంగీత కచేరీలు
ఏర్పేడు: ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్‌లో స్పిక్ మాకే సహకారంతో ‘విరాసత్–2026’ పేరుతో చేపట్టిన సంగీత కచేరీ, వర్క్‌షాప్‌లు ఆకట్టుకున్నాయి. శనివారం ఈ మేరకు ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య మాట్లాడుతూ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్వాన్ అమృత మురళి కర్ణాటక సంగీత కచేరీ ప్రదర్శన ఆకట్టుకుంది.


