● జిల్లా పోలీసు బాస్ మెడపై ‘పచ్చ’కత్తి..! ● చిత్తూరు జిల్లాలో రాజకీయ బదిలీలు ● జిల్లాలో 264 మంది పోలీసుల బదిలీ ● పుంగనూరు హత్యను ఆయుధంగా మలుచుకున్న కూటమి నేతలు ● పోలీసుశాఖలో రాజకీయ బదిలీలపై తీవ్ర చర్చ ● అసెంబ్లీ సమావేశాలైపోతే ‘బాసు’ బదిలీ?
చిత్తూరు అర్బన్/ పుంగనూరు : ‘‘పుంగనూరులో మా కార్యకర్త (టీడీపీ) హత్యకు కారణం పోలీసులే. పోలీస్ స్టేషన్లలో గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్లు ఇంకా ఉన్నారు. వాళ్లను బదిలీ చేయమంటే ఎస్పీ ఒప్పుకోలేదు. అందుకే ఈ హత్య జరిగింది. దీనికి కారణం పోలీసు శాఖే’’ అంటూ మూడు రోజుల కిందట కూటమి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇది ఏకంగా చిత్తూరు జిల్లా పోలీసు బాసు మెడపై కత్తిపెట్టి లొంగదీసుకునేంత పనిచేసింది. రెండు రోజులుగా చిత్తూరు పోలీసుశాఖలో ఏకంగా 264 మంది పోలీసులను ఉన్నట్టుండి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు ఉన్నారు. పుంగనూరులో జరిగిన హత్యా ఉదంతాన్ని అడ్డంపెట్టుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఐపీఎస్ అధికారిని లక్ష్యంగా చేసుకుని బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రాజకీయ బదిలీలు జరిగినట్లు స్పష్టమవుతోంది.
కూటమి పాలనలో..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ నాయకులు చేస్తు న్న దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. ఎస్పీ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల పన్నుల వసూలు బిల్డింగ్‌ను పెట్రోలు పోసి తగులబెట్టడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడటం సర్వసాధారణంగా చేసేశారు. తాజాగా పుంగనూరులో వెంకటరమణ, రామకృష్ణ ఇరువురు బంధువులే. వీరి మధ్య నెలకొన్న పాత గొడవలు రామకృష్ణ హత్యకు దారితీశాయి. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం కనిపిస్తున్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుంగనూరు సీఐతో పాటు ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. పరిస్థితి అక్కడితో ఆగిపోలేదు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెల లు సమీపిస్తుంటే అన్ని ప్రభుత్వ విభాగాల్లో ‘పచ్చ’ ముద్ర వేసిన ఆ పార్టీ నేతలు.. పోలీసు శాఖలోనూ ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ, ఏఎస్పీల్లో సామాజికవర్గం సాక్ష్యంగా బదిలీలు చేయించారు. కానీ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐలోనూ తాము చెప్పిన వాళ్లను బదిలీ చేయాలని పోలీసు బాసుపై ఒత్తిడి తీసు కొచ్చారు. జిల్లాలోని ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఎవరు పనిచేయాలి..? అనే పేర్లతో కూడిన జాబితాను రూ పొందించారు. ఇందులో అన్నింటికీ ఒప్పుకోని పోలీ సు బాసు మెడపై పుంగనూరు హత్య ఘటనను ఆ యుధంగా ఉపయోగించారు. ఫలితంగా సోమ వారం 45 మంది, మంగళవారం 219 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 264 మంది సిబ్బందిని బదిలీ చేయడం వెనుక కూటమి పార్టీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పారన్నది సుస్పష్టం.
అసెంబ్లీ సమావేశాలు కాగానే..
అసెంబ్లీ సమావేశాలు పూర్తవగానే ‘పోలీసు బాసు’ను కూడా జిల్లా నుంచి పంపించేస్తామని కూటమి నేతలు బహిరంగంగానే కార్యకర్తల వద్ద చెబుతున్నారు. బ్యూరోకాట్స్‌పై అధికారపార్టీ నాయకులు ఈస్థాయిలో ఒత్తిళ్లు చేస్తే ఎవరూ పనిచేసే పరిస్థితులు ఉండవని ఉన్నతాధికారులు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల కొత్తగా వచ్చే అధికారులు సైతం చట్టానికి లోబడి కాకుండా.. తాము రూపొందించిన రెడ్‌బుక్ రాజ్యాంగానికి తదనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని కూటమి నేతలు హెచ్చరికలు పంపించారు. మరోవైపు పుంగనూరు హత్యానంతరం అనంతపురం డీఐజీ షీమోషీ సైతం చిత్తూరులో ఉంటూ ఇక్కడి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పుంగనూరు పోలీస్‌స్టేషన్
పుంగనూరులో పోలీసులందరూ బదిలీ ...
పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న సీఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ సుబ్రమణ్యం హత్య కేసులో నిర్లక్ష్యం వహించారని సస్పెండ్ అయ్యారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్‌ఐని అనంతపురానికి బదిలీ చేశారు. ఇక్కడ ఎస్‌ఐలు లేని కారణంగా ఆయనను కొనసాగిస్తున్నారు. కాగా ఎమ్మెల్యే అరిచారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఒక ఏఎస్‌ఐని, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లను కలిపి సుమారు 40 మంది పోలీసులను బదిలీ చేశారు. కాగా ఈ హత్య కేసులో వీరికి ఏమాత్రం సంబంధం లేకపోవడం గమనార్హం.
మేమేమి తప్పుచేశాం...
అర్ధాంతరంగా బదిలీ అయిన పోలీస్ కుటుంబాల్లో మేమేమి తప్పు చేశాం....మా భర్తలు ఏం తప్పు చేశారు... అర్ధాంతరంగా బదిలీలు చేస్తే మా పిల్లలు చదువులేంటి...మా కుటుంబంలోని వృద్ధులను ఎలా సంరక్షించాలి. ఉద్యోగులైన భార్యభర్తలకు కూడా అవకాశాలు కోల్పోయాం. తప్పు చేసిన వారితో పాటు మేము శిక్ష అనుభవించాలా అంటూ బదిలీ అయిన పోలీసు కుటుంబాల్లోని పలువురిలోనూ ఈ విధమైన ప్రశ్నలే వినపడుతున్నాయి. ఈ విషయమై జిల్లా ఎస్పీ మరోసారి పునరాలోచించాలి.