● ద్రవిడ వర్సిటీలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతన వెతలు ● ఏడాది నుంచి జీతాలు అందక అవస్థలు ● ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం ● సమ్మెకు సన్నద్ధమవుతున్న ఉద్యోగులు
కుప్పం : ద్రవిడ విశ్వవిద్యాలయంలో సుమారు 15 ఏళ్ల నుంచి ఔట్‌సోర్సింగ్ విధానంలో 206 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఏడాది నుంచి జీతాలు రావడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై భరోసా ఇచ్చారు. వెంటనే జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత ఆరునెలల వేతనాలు మాత్రం అందించారు. తర్వాత నుంచి వేతనాల ఊసే వదిలేశారు. ఇక అప్పటి నుంచి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబపోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భూములిచ్చినవారే అధికం
ద్రవిడ వర్సిటీ అభివృద్ధికి భూములు త్యాగం చేసిన రైతుల కుటుంబాల్లోనే పలువురికి ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇచ్చారు. అది కూడా అటెండర్లు, స్వీపర్లు వంటి చిరుద్యోగులుగానే పనిచేస్తున్నారు. వీరు మొదట్లో 250 మందికి పైగా ఉండేవారు. ప్రస్తుతం 206 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.
జీతాలు ఇవ్వలేం..!
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ద్రవిడ వర్సిటీ అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు ఫైనాన్స్ అప్రూవల్ మంజూరు చేయాలంటూ కోరారు. దీనికి సంబంధించిన ఫైళ్లను ప్రభుత్వం సోమవారం తిరస్కరించినట్లు తెలిసింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వర్సిటీనే జీతాలు చెల్లించుకోవాలని తేల్చిచెప్పినట్లు సమాచారం. రిజిస్ట్రార్ దీంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నాయకులను పిలిపించి విషయం వివరించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రవిడ వర్సిటీనే నమ్ముకుని చాలీచాలని జీతాలతో బతుకుతున్నామని, ప్రస్తుతం అది కూడా అందకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యంగా మారుతోందని వాపోతున్నారు.
మోగనున్న సమ్మె సైరన్?
జీతాలు ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చిచెప్పిన నేపథ్యంలో ఉద్యోగులు సమ్మెకు సైరన్ మోగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు వర్సిటీలో నాన్‌టీచింగ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం సమావేశమై సమ్మైపె చర్చించనున్నట్లు తెలిసింది.