– పంట పొలాలు ధ్వంసం
గుడిపాల: ఒంటరి ఏనుగు హల్‌చల్ చేసింది. పంట పొలాలను ధ్వంసం చేసింది. వెప్పాలమానుచేను, పిళ్లారికుప్పం, అడవిచేను గ్రామాల్లోని పలు రైతులకు సంబంధించిన వరి , అరటి, కొబ్బరి తోటలను నాశనం చేసింది. పిళ్లారికుప్పంలో కొబ్బరి చెట్ల అడుగు భాగం మొత్తాన్ని తినేసింది. గుడిపాల మండలంలోని పిళ్లారికుప్పం, పాపసముద్రం, అడవిచేను, బండపల్లె, చిత్తపార ప్రాంతాల్లో వరి పంటను రైతులు అత్యధికంగా సాగు చేశారు. ప్రస్తుతం ఏనుగు ఆ ప్రాంతం వైపే ఉండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు.
పొలాల వద్దకు రాత్రి వేళల్లో వెళ్లవద్దు
రైతులు రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఏ సమయంలో ఏ ప్రాంతంలోకి ఒంటరి ఏనుగు సంచరిస్తుందో తెలియడం లేదని రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పాడి పశువులను కొంత మంది రైతులు పొలాల వద్ద కట్టేస్తున్నారని వాటిని ఇంటి వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందజేస్తామని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనందరెడ్డి తెలిపారు.