● కబళించిన కరెంటు తీగలు ● అక్కడికక్కడే యువకుడు దుర్మరణం ● వేటగాళ్ల పనేనా లేక రైతు అనాలోచిత నిర్ణయమా!
గంగవరం : పుట్టిన రోజే ఓ యువకుడికి ఆఖరి రోజు అవుతుందని ఊహించలేకపోయాడు. పొలాల వద్ద లాగిన కరెంటు తీగలు మృత్యువు రూపంలో కబళించాయి. ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. ఈ ఘటన గంగవరం మండలంలోని కొత్తపల్లి, మేలుమాయి సరిహద్దు పొలాల వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, అటవీశాఖ అధికారుల కథనం మేరకు.. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు కార్తీక్ (22) డిగ్రీ కోర్సును మధ్యలో ఆపేసి గ్రామంలోనే కూలి పనులకు వెళ్తున్నాడు. అయితే బుధవారం రోజున అతని పుట్టిన రోజు కావడంతో గ్రామంలో తోటి స్నేహితులు యుగంధర్, చరణ్, అజయ్‌తో కలిసి గ్రామంలోని రైతు సేవా కేంద్రం ఎదుట రాత్రి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతటితో తమ ఇళ్లకు వెళ్లిపోకుండా ఊరికి సమీపంలోని మేలుమాయి రెవెన్యూకు సంబంధించిన పొలాల వద్దకు ఎందుకనో వెళ్లారంటూ గ్రామస్తులు చెబుతున్నారు. కొందరు ఆవు తప్పిపోవడంతో వెతకడం కోసం వెళ్లారని, మరికొందరేమో టెంకాయల కోసం వెళ్లారంటూ.. ఒక్కోరు.. ఒక్కోరకంగా చెబుతున్నారు. అయితే తామెందుకు వెళ్లారనే వాస్తవాలు వెలికిరాలేదు. ఇదిలా ఉండగా కార్తీక్‌తో పాటు తన స్నేహితులు అందరూ కలిసి పొలాల వద్దకు వెళ్లగానే అక్కడి పొలంలో లాగిన కరెంటు తీగల తీవ్రతకు కార్తీక్ శరీర భాగాలు పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అతడిని కాపాడే క్రమంలో మరో యువకుడు యుగంధర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన యువకులు సురక్షితంగా తప్పించుకున్నారు. జరిగిన విషయాన్ని తోటి స్నేహితులు సెల్‌ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా ఊరి జనంతో పాటు అటవీశాఖ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఎలా జరిగిందనే వివరాలను కార్తీక్ స్నేహితుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయగా వాళ్ల నుంచి సరైన సమాధానం రాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేటగాళ్ల పనేనా లేక రైతు అనాలోచిత
నిర్ణయమా!
ప్రమాదానికి కారణం వేటగాళ్లు వన్యప్రాణుల వేట కోసం కరెంటు తీగలు లాగడంతో ఈ ప్రమాదం జరిగిందా లేక రైతు తమ పొలంలో పంటను పందుల నుంచి కాపాడుకునేందుకు తన అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పుట్టిన రోజే.. ఆఖరి రోజు
పుట్టిన రోజే.. ఆఖరి రోజు
పుట్టిన రోజే.. ఆఖరి రోజు