
గురజాల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూమాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ పెట్టిన పోస్టు - Sakshi
చిత్తూరు అర్బన్: చిత్తూరు తెలుగుదేశం పార్టీలో తేనెతుట్టి కదిలింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థిగా ఇటీవల ప్రకటించిన గురజాల జగన్‌మోహన్ నాయుడుకు సహాయ నిరాకరణ చేయాలని పార్టీలోని పలువర్గాలు తీర్మానించుకున్నాయి. ఓ వైపు వన్నియకుల క్షత్రియులు (నాయకర్లు), మరోవైపు బలిజ (కాపు) నాయకులు టీడీపీ అధిష్టానంపై మండిపడుతున్నారు. ఆదివారం సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన గళం విప్పారు.
వన్నియర్లకు షాక్!
వైఎస్సార్‌సీపీ వన్నెకుల క్షత్రియుడైన సిపాయి సుబ్రమణ్యానికి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి గౌరవించింది. ఇదే సామాజికవర్గానికి చెందిన సీఆర్ రాజన్ చిత్తూరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి టికెట్ ఆశించారు., వైఎస్సార్‌సీపీలో సిపాయికి దక్కిన గౌరవాన్ని తమ పార్టీ నేతలతో ప్రస్తావించారు. గత ఆర్నెళ్లుగా సీఆర్ రాజన్ తమ సామాజికవర్గానికి చెందిన నేతలను కలుస్తూ, పలువురికి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పించారు. చిత్తూరులో ఓ కార్యాలయాన్ని సైతం ప్రారంభించుకున్నారు. తీరా జగన్‌మోహన్ నాయుడుకు టికెట్ ఇవ్వడంతో రాజన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
జయహో బీసీ అంటూ నినదించి, చివరకు ఓసీలకు కొమ్ముకాశారంటూ నాయకర్ల సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీకి చెందిన వన్నెకుల క్షత్రియ నేత విజయ్‌కుమార్ తదితరులు సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోస్తున్నారు. మూడు రోజుల్లో జిల్లాలోని నాయకర్లతో కలిసి శ్రీకాళహస్తి నుంచి కుప్పం వరకు బస్సుయాత్ర చేపట్టి, బీసీలకు జరిగిన అవమానం, అన్యాయంపై నిరసన తెలియజేయనున్నట్లు ప్రకటించారు.
కాకమీదున్న కాపులు
మరోవైపు చిత్తూరు టీడీపీ టికెట్ ఆశించిన కాపు సామాజిక వర్గ నాయకులు సైతం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కటారి హేమలతకు టికెట్ ఇస్తారని అనుకుంటే.. ఆమెను నడిరోడ్డుపై వదిలేశారని కాపు నేతలు నిట్టూరుస్తున్నారు. కనీసం ఆదికేశవులు కుమార్తె తేజస్విని, కాజూరు బాలాజీని అభ్యర్థిగా ప్రకటించి ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో చిత్తూరు నుంచి పోటీ చేయడానికి స్థానిక అభ్యర్థులు పనికిరారా..అంటూ పలువురు బలిజ నాయకులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా టీడీపీ అభ్యర్థికి ఏమాత్రం సహకరించకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.