కొత్త బాస్ టీం రెడీ
చిత్తూరు అర్బన్ : శ్రీస్పెషల్ బ్రాంచ్...శ్రీ జిల్లా పోలీసు శాఖలో కీలకమైన విభాగం. పోలీసుశాఖ పరిపాలనతో పాటు స్టేషన్లలో అధికారుల పనితీరు, రాజకీయ పార్టీల పనితీరు, నాయకుల తప్పటడుగులు, శాంతిభద్రతలు ప్రజలకు ప్రశాంతతను ఇస్తోందా..? గంజాయి, మాదక ద్రవ్యాలు, లాటరీ, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎస్పీకి చేరవేయాల్సిన బాధ్యతతో పనిచేయాల్సిన విభాగం స్పెషల్‌బ్రాంచ్ (ఎస్‌బీ). తాము సేకరించిన సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎస్పీకు చేరవేయాలి. చిత్తూరు కొత్త ఎస్పీగా నాలుగు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడీ పనితీరుపై ఇలా ఉంటుందనే భావనపై ఇప్పటి వరకు స్పష్టమైన సంకేతాలు ఏవీ వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఆయన తొలుత ఎస్‌బీ విభాగంపై ఫోకస్ చేసి, దాన్ని ప్రక్షాళన చేశారు. జిల్లాలో ఏం జరుగుతున్నా తన దృష్టికి రావాల్సిందేనంటూ ఎస్‌బీ విభాగాన్ని ప్రక్షాళన చేసి, కొత్త టీంను నియమించుకున్నారు.
వాస్తవాలు చేరితే సరి..!
ఎస్‌బీ ప్రక్షాళన పూర్తవడంతో ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై బాధ్యత పెరిగిందనే చెప్పాలి. రాజకీయ పరిస్థితులు పక్కన పెడితే, సామాన్యులకు ఇబ్బందులు కలిగించే అంశాలను ఎప్పటికప్పుడు ఎస్పీకి చెప్పాల్సిన అవసరం ఎస్‌బీ విభాగంపై పడింది. అందులోనూ కొత్త కూర్పుతో ఎస్‌బీను ఏర్పాటు చేసుకున్న ఎస్పీ ఎదుట వాస్తవాలను తప్పనిసరిగా ఉంచాల్సిందే. ఇప్పటికే జిల్లా కేంద్రంలో జరుగుతున్న లాటరీ వ్యవహారంపై ఉక్కుపాదం మోపి, దీనికి వంత పాడుతున్న సొంతశాఖలోని కొందరిని సాగనంపడానికి విచారణ పూర్తి కావచ్చింది. ఇక గంజాయి, పేకాట క్లబ్బులు, కొన్ని స్టేషన్లలో న్యాయం కోసం వెళితే ప్రైవేటు వ్యక్తుల వద్దకు పంచాయతీలకు పంపడం లాంటి ఘటనలపై ఎస్పీ వాస్తవాలను తెలుసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అలా కాకుండా అధికారికి భయపడో, వాస్తవాలు చెబితే మన ఉనికికి ఇబ్బందా..? అని ఆలోచిస్తే ఎస్పీ నమ్మకం వమ్మువుతుంది. ముందుగా సొంత పోలీసుశాఖను సరిదిద్దుకుని ఆపై ప్రజలకు నమ్మకం కలిగించే దిశగా అడుగులు వేస్తున్న డూడీకు.. స్పెషల్ బ్రాంచ్ ఫీడ్ బ్యాక్ కచ్చితంగా ఇస్తారా లేదా.. షారా మామూలేనా ? అనేది వేచి చూడాల్సిందే.
గతంలా ఉండొద్దని..
డూడీ రాక మునుపు ఎస్‌బీ విభాగంపై అవినీతి ఆరోపణలు లేకున్నా.. వాస్తవాలను అప్పటి ఎస్పీకి చేరవేయడంలో ధైర్యం చేయలేకపోయారనే అపవాదు ఉంది. ప్రధానంగా కానిస్టేబుళ్ల బదిలీల్లో పోలీసు కుటుంబాలు పడ్డ ఇబ్బందులు, అనారోగ్యంతో ఉన్న వాళ్లను, పదవీ విరమణకు దగ్గర్లో ఉన్నవాళ్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడంపై దుమారం రేగింది. ఇక కొందరు అధికారులు దొంగల నుంచి డబ్బులు తీసుకుని వాటాలు వేసుకున్నారనే ఆరోపణలు, గుట్కా వాహనాల నుంచి మామూళ్లు, లింగ నిర్ధారణపై స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగి నిందితులను పట్టించినా.. డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు వాస్తవామా కాదా అనే విషయాన్ని గత పోలీస్ బాస్‌కు చెప్పడంలో ఎస్‌బీ సాహసం చేయలేదని నింద మిగిలిపోయింది. కొత్తగా వచ్చిన డూడీ.. అసలు జిల్లాలో ఏం జరిగినా తన నోటీసులో ఉండాల్సిందేనంటూ ఎస్‌బీని ప్రక్షాళన చేశారు. ఇక్కడ పనిచేసిన ఇన్‌స్పెక్టర్ మనోహర్‌ను డీసీఆర్‌బికు, ఎస్‌ఐ అనిల్‌ను డీటీసీకు బదిలీ చేస్తూ.. మురళీ మోహన్‌ను ఎస్‌బి పగ్గాలు అప్పగించారు. దీంతో ఈ విభాగంలో పారదర్శకత ఉంటుందని నమ్మకం ఉంచారు.


