నేడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటన
పుంగనూరు: మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పుంగనూరు పట్టణంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారని చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
10 నుంచి
సంక్రాంతి సెలవులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలకు జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆ ఉత్తర్వులు డీఈవో కార్యాలయానికి చేరాయి. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. జనవరి 19 న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.
నేడు కలెక్టరేట్‌లో
ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖా పరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
పోలీసు గ్రీవెన్స్
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్మ్‌డు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవై నా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.
స్క్రబ్ టైఫస్..టెన్షన్
– అవగాహన లేక ఆందోళన
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు అధికమయ్యాయి. కేసుల నమోదులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కాలంలో 492 కేసులు నిర్ధారణ కాగా.. నవంబర్ నుంచి ఇప్పటి వరకు 57 కేసులు వచ్చాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కేసులను గుర్తించడంతో పాటు అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఇంటివద్ద అపరిశుభ్రత, పూల, ఇతరచెట్లు ఉండండంతో కొంత మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని వా రి విచారణలో తేలింది. అయితే అత్యధిక మంది రైతులే కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. వ్యవసాయ పొలలాకు వెళ్లేవారు, పశువుల పెంపంకం దారులే ఈ వ్యాధి బారిన పడినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ కట్టడికి శాఖతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థకశాఖ అధికారులు, సిబ్బంది రైతులకు అవగాహన కల్పి స్తే బాగుంటుందని వైద్యశాఖ పేర్కొంటోంది. తద్వారా స్క్రబ్ టైఫస్ కేసులను నివారించవచ్చునని శాఖ భావిస్తోంది.
విద్యుత్ బిల్లుల
వసూళ్లు రూ.1.35 కోట్లు
చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు పనిచేశాయి. దీంతో రెండు జిల్లాల నుంచి 11,200 మంది వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించారు. తద్వారా సంస్థకు రూ.1.25 కోట్లు వచ్చిందని ట్రాన్స్‌కో ఎస్‌ఈ లు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్‌రావు తెలిపారు. సకాలంలో విద్యుత్ బిల్లులను వినియోగదారులు చెల్లించి జరిమానాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఎన్‌ఎస్‌యూలో
ఇంటర్వ్యూలు
తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలకు వా క్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వర్సి టీ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ ఫెలో–1, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ ప్రూఫ్ రీడర్– 4 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, ఇతర వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.


