పూత కలవరం
మామిడి పూత ఆలస్యంపై ఆందోళన పెరిగిన తేమ శాతంతో పంటకు నష్టం ఎకరాకు రూ. 40 వేలకు పైగా ఖర్చు పూత కోసం అన్నదాత పాట్లు
అకాల వర్షాలు, తీవ్రమైన మంచు, చీడ పీడలతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా సాధారణంగా నవంబర్, డిసెంబర్‌లో మామిడి పూత వస్తుంది.
ఇప్పటి వరకు పూత రాకపోవడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి, మార్చిలో పిందెలు రావాల్సి ఉంది. ఏప్రిల్, మే నెలల్లో కాయలు కోతకు వస్తాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా గతేడాది తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు.. ఈ సారి ఇంకా పూత రాకపోవడంతో అందరిలోనే కలవరం మొదలైంది.
విజయపురంలో పూతలేని మామిడి తోట
విజయపురం : వాతావరణంలో మార్పులు మామి డి రైతులకు శాపంగా మారాయి. మోంథా తుపాన్ కారణంగా భూమిలో తేమ శాతం పెరిగింది. ఫలితంగా మామిడి చెట్లకు పూత రావడంలో ఆలస్యమవడంతో రైతులు కలవర పడుతున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి పూత వచ్చి, ఫిబ్రవరి, మార్చిలలో పిందెలు వచ్చేవి. కానీ డిసెంబర్ నెల చివరి వారం గడస్తున్నా ఇంత వరకు పూత జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మామిడి పూత కోసం రూ. లక్షలు వెచ్చించి రైతులు మందులను పిచికారీ చేయాల్సి వసతవస్తోంది.
సూచనలు, సలహాలు ఏవీ?
పంటల సీజన్‌లో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ఉద్యాన శాఖ(హార్టికల్చర్) ఆఫీసర్లు మామిడి తోటలను పట్టించుకోవడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. వచ్చిన పూత రాలకుండా, కొత్త పూత వచ్చేందుకు తీసుకోవాల్సి న సస్య రక్షణ చర్యలపై అధికారులు అవగాహన కల్పించాల్సి ఉన్నప్పటికీ జిల్లాలో ఆ దిశగా చర్యలు ఎక్కడా కనిపించడం లేదని, పొలం–పిలుస్తోంది కార్యక్రమాల్లో ఎక్కడ కాని హార్టికల్చర్ అధికారులు కనిపించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. దీంతో రైతులే సొంతగా మందులు పిచికారీ చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు మామి డి తోటలను సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
లక్ష రూపాయల మందులు కొట్టించా..
నాలుగు ఎకరాల మామిడి తోట సాగు చేస్తున్నా. ఇప్పటి వరకు పూత సరిగా రాలేదు. ఇప్పటికే లక్ష పెట్టి క్లోరిఫై పాస్, సాఫ్ పొడి, ప్లానోఫాస్, మందులను చెట్లకు కొట్టించా. గతేడాది అనుకున్న దిగుబడి రాలే.. ఈసారైనా లాభాలు వస్తాయనుకుంటే పూతే లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.
– శరత్, మల్లారెడ్డికండ్రిగ, విజయపురం
రైతులకు ఏటా కష్టాలే
గత ఏడాదిలో దిగుబడి లేక చాలా నష్టపోయాం. ఈ ఏడాదైనా మంచి దిగుబడి వస్తే, అప్పులను తీర్చుకుంటామని అనుకొన్నా, కానీ ఇంత వరకు పూత లేకపోవడంతో ఆందోళనగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.
– సురేష్ రాజు, వడమాలపేట
పూత కలవరం
పూత కలవరం


