ఐపీవో ప్రారంభానికి ముందే దరఖాస్తు!

Zomato IPO to be first on Paytm Money new pre-booking of IPO - Sakshi

అందుబాటులోకి తెచ్చిన పేటీఎం

జొమాటో పబ్లిక్‌ ఇష్యూతో షురూ

రిటైల్‌ స్టాక్‌ ఇన్వెస్టర్లకు సర్వీసులు

రానున్న పలు ఐపీవోలకూ అవకాశం

ఇకపై పేటీఎమ్‌ డీమ్యాట్‌ ఖాతాలు

న్యూఢిల్లీ: ప్రైమరీ స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయదలచిన రిటైల్‌ ఇన్వెస్టర్లకు డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌ సైతం సర్వీసులు అందించనుంది. డీమ్యాట్‌ ఖాతాలను తెరవడం ద్వారా ఇందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. పేటీఎమ్‌ వినియోగదారులు ఇక నుంచీ పబ్లిక్‌ ఇష్యూలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ దిగ్గజం జొమాటో పబ్లిక్‌ ఇష్యూని వేదిక చేసుకుంది. జొమాటో ఇష్యూ బుధవారం నుంచీ ప్రారంభంకానుంది. అంతకంటే ముందుగానే అప్లై చేసుకునేందుకు పేటీఎమ్‌ వీలు కల్పిస్తోంది. అయితే ఐపీవో ప్రారంభమయ్యాకే దరఖాస్తుల ప్రాసెసింగ్‌ ఉంటుంది.

రిటైలర్లకు జోష్‌...: ఐపీవో తేదీకంటే ముందుగానే దరఖాస్తు చేసుకునేందుకు పేటీఎమ్‌ వీలు కల్పించడంతో మరింతమంది రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రైమరీ మార్కెట్‌ బాట పట్టే అవకాశముంది. నిజానికి సాధారణ పద్ధతిలో ఐపీవో ప్రారంభమయ్యాకే బిడ్స్‌కు వీలుంటుంది. కాగా.. గత రెండు రోజులుగా ప్రారంభమైన పేటీఎమ్‌ మనీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా భారీస్థాయిలో రిటైలర్లు జొమాటో పబ్లిక్‌ ఇష్యూకి దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీఐపీవో అప్లికేషన్‌ పేరుతో ఇందుకు వీలు కల్పించింది. వెరసి మార్కెట్‌ సమయాల్లో బిజీగా ఉండే యువత, తదితరులకు అన్నివేళలా ఐపీవోకు అప్లై చేసేందుకు దారి చూపుతోంది. ఈ ఆర్డర్లను పేటీఎమ్‌ మనీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా నమోదు చేస్తుంది. ఆపై పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభమయ్యాక ఎక్సే్ఛంజీలకు బదిలీ చేస్తుంది. పబ్లిక్‌ ఇష్యూ దరఖాస్తుకు సంబంధించిన సమాచారాన్ని  సైతం వినియోగదారుడు అన్నివేళలా తెలుసుకునేందుకు వీలుంటుంది. భారీ స్పందన లభించే కొన్ని ఐపీవోలకు దరఖాస్తు సమయంలో సర్వర్ల సమస్యలు తలెత్తినప్పటికీ పేటీఎమ్‌ ఫీచర్‌ ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది.

ఐపీవోకు ఓకే...
తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో భాగంగా రూ. 12,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదించిన పబ్లిక్‌ ఇష్యూకి పేటీఎమ్‌ వాటాదారులు అనుమతించారు. సెకండరీ సేల్‌ ద్వారా మరో రూ. 4,600 కోట్లను సమకూర్చుకోనున్నట్లు తెలుస్తోంది. వెరసి రూ. 16,600 కోట్ల ఐపీవో చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈజీఎంలో కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మను నాన్‌ప్రమోటర్‌గా సవరించే ప్రతిపాదనకూ వాటాదారులు ఆమోదముద్ర వేశారు. కంపెనీలో విజయ్‌కు ప్రస్తుతం 14.61 శాతం వాటా ఉంది. అయితే పేటీఎమ్‌ చైర్మన్, ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు.

భారీ డిమాండ్‌
గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్‌ కళకళలాడుతోంది. దరఖాస్తుదారులు అధికమయ్యా రు. మార్కెట్‌ వేళల్లో పనులు, దరఖాస్తు సమయంలో ఆలస్యాలు తదితరాల కారణంగా కొంత మంది వీటిని మిస్‌ అవుతున్నారు. దీంతో ఎలాం టి అవకాశాలు కోల్పోకుండా ఆధునిక ఫీచర్స్‌ను రూపొందించాం. తద్వారా వినియోగదారులు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించాం. ఒకే క్లిక్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు.  
– వరుణ్‌ శ్రీధర్, సీఈవో పేటీఎమ్‌ మనీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top