ఐదు నెలల గరిష్టానికి టోకు ధరలు | Sakshi
Sakshi News home page

ఐదు నెలల గరిష్టానికి టోకు ధరలు

Published Tue, Nov 16 2021 5:35 AM

WPI inflation spikes to 12. 54percent in October - Sakshi

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 12.54 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే 2021 అక్టోబర్‌లో టోకు బాస్కెట్‌ ఉత్పత్తుల ధర 12.54 శాతం ఎగసిందన్నమాట. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయిలో ధరల తీవ్రత ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల భారీ పెరుగుదల, సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరల తీవ్రత వంటి అంశాలు దీనికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

ధరలన్నీ పైపైకి...
► మినరల్‌ ఆయిల్స్, బేసిక్‌ మెటల్స్, ఫుడ్‌ ప్రొడక్ట్స్, క్రూడ్‌ పెట్రోలియం, సహజవాయువు, కెమికల్స్, రసాయన ఉత్పత్తుల వంటివి గతేడాది అక్టోబర్‌తో పోల్చితే తాజా సమీక్షా నెలల్లో భారీగా పెరిగాయి.  
► తయారీ రంగంలో సమీక్షా నెల్లో ద్రవ్యోల్బణం 12.04 శాతంకాగా, సెప్టెంబర్‌లో 11.41 శాతం.
► ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌ రంగాల్లో 2021 అక్టోబర్‌ ద్రవ్యోల్బణం 37.18 శాతం. సెప్టెంబర్‌లో 24.81 శాతం. ఒక్క క్రూడ్‌ పెట్రోలియం ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 71.86% ఉంటే, అక్టోబర్‌లో ఏకంగా 80.57 శాతానికి ఎగసింది.  
► ఆహార ధరల విభాగానికి వస్తే, సెప్టెంబర్‌లో 4.69 శాతం తగ్గాయి (2020 ఇదే నెలతో పోల్చి). అయితే అక్టోబర్‌లో ఈ తగ్గుదల కేవలం 1.69 శాతంగానే ఉంది. కూరగాయల ధరల తగ్గుదల 18.49 శాతం ఉంటే, ఉల్లి విషయంలో తగ్గిన శాతం 25.01 శాతం అని గణాంకాలు వెల్లడించాయి.


ఏప్రిల్‌ నుంచీ రెండంకెల్లోనే...
టోకు ధరల ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగడం ఏప్రిల్‌ నుంచీ ఇది వరుసగా ఏడవనెల.అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్‌– 2022 మార్చి) ఇప్పటి వరకూ ఒక అంకెలో టోకు ద్రవ్యోల్బణం లేదన్నమాట. టోకు ద్రవ్యోల్బణం స్పీడ్‌ ఏప్రిల్‌ (10.74%), మే (13.11%) జూన్‌ (12.07%), జూలై (11.16%), ఆగస్టు (11.39%) నెలల్లో రెండంకెల పైనే కొనసాగింది. సెప్టెంబర్‌లో 10.66%గా నమోదుకాగా, తాజాగా అక్టోబర్‌లో 12.54%గా ఉంది.

అయితే ప్రస్తుతం ఈ స్థాయి ద్రవ్యోల్బణం కొనసాగడానికి 2020 ఇదే నెలల్లో  ద్రవ్యోల్బణ పరిస్థితిపై లో బేస్‌ ఎఫెక్ట్‌ ఉండడమూ కారణమన్న అంచనాలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌. ఉదాహరణకు 2020 అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం కేవలం 1.31 శాతం. కాగా, రిటైల్‌ ద్రవ్యోల్బణం  నాలుగు నెలల దిగువ బాట నుంచి ‘యూ టర్న్‌’  తీసుకుని అక్టోబర్‌లో 4.48 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement