‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్‌ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది.
అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్‌ఫోర్స్ సర్వేను నిర్వహించింది.
ఉత్పాదకతపై భిన్న అభిప్రాయాలు
ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగుల ఉత్పాదకత విషయంలో కొంత అయోమయం నెలకొన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రతిరోజూ ఏఐని ఉపయోగించే వారిలో 30 శాతం మంది పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పటికీ.. ఏఐ వాడని వారితో పోలిస్తే తాము తక్కువ ఉత్పాదకతతో ఉన్నట్లు భావిస్తున్నామని వారు చెప్పారు. నిత్యం చేసే సాధారణ పనులను ఏఐ చూసుకోవడం వల్ల, తమ సొంత పనితీరును అంచనా వేయడం కష్టంగా మారుతోందని ఉద్యోగులు భావిస్తుండటమే దీనికి కారణం.
సాంకేతికత-స్కిల్స్ కీలకం
వ్యాపార సంస్థల అధిపతులు కేవలం ‘తక్కువ మందితో ఎక్కువ పని’ అనే కోణంలో ఆలోచించకుండా, సాంకేతికతను, మానవ నైపుణ్యాలను ఎలా మేళవించాలనే దానిపై దృష్టి పెట్టాలని రాహుల్ గోయల్ సూచించారు. రోజు వారీగా పదే పదే చేసే పనులను ఏఐ సులువుగా పూర్తి చేస్తుంది.
దీనివల్ల ఉద్యోగులకు సమయం కలిసివచ్చి, వారు నిర్ణయాలు తీసుకోవడం, సమస్యల పరిష్కారం, సమన్వయం వంటి మానవ మేధస్సుకు సంబంధించిన సృజనాత్మకత పనులపై మరింత దృష్టి పెట్టవచ్చు. నాలెడ్జ్ ఆధారిత రంగాల్లో ఉన్న ఉద్యోగులు తమ కెరీర్‌పై ధీమాగా ఉన్నారు. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి సమయం వృథా చేయకుండా, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేíÙంచి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని గోయల్ వివరించారు.


