సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌: వెయిటింగ్‌లో ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌

Waiting Periods Go Up For e-commerce Deliveries Amid Second Wave - Sakshi

నిత్యావసరాలకు వేచి చూడాల్సిందే 

సెకండ్‌ వేవ్‌ ఇందుకు కారణం

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ ద్వారా నిత్యావసరాలకు ఆర్డర్‌ చేశారా? గతంలో మీరు ఆర్డర్‌ ఇచ్చిన రోజే డెలివరీ చేసిన సంస్థలు ఇప్పుడు చేతులెత్తేశాయి. సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఒకవైపు, లాక్‌డౌన్లు మరోవైపు.. వెరశి ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఊహించనంత పెరగడంతో కస్టమర్లు తమ వంతు కోసం వేచి చూడక తప్పడం లేదు. ఈ–కామర్స్‌ కంపెనీలు కొన్ని చెన్నైలో డెలివరీకి వారం రోజుల సమయం కూడా తీసుకుంటున్నాయని సమాచారం. ఈ నగరంతో పోలిస్తే ఢిల్లీ, ముంబైలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కోవిడ్‌–19 కారణంగా స్థానికంగా నియంత్రణలు ఉండడంతో డెలివరీ ఆలస్యం అవుతుంది అంటూ బిగ్‌బాస్కెట్‌ తన కస్టమర్లకు చెబుతోంది. డిమాండ్‌ విపరీతంగా ఉంది. ఆర్డర్‌ చేసేందుకు వీలుగా టోకెన్లను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే హైజీన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్యాకింగ్‌ చేయడమూ డెలివరీల ఆలస్యానికి మరొక కారణం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉత్పత్తులను 2 గంటల్లో చేరవేస్తున్నట్టు గ్రోఫర్స్‌ తెలిపింది. ఇతర ఆర్డర్లను ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నట్టు వెల్లడించింది.

డెలివరీ బాయ్స్‌ కావలెను.. 
పరిశ్రమకు డెలివరీ బాయ్స్‌ కొరత కూడా సమస్యగా పరిణమించింది. ఉద్యోగులు లేదా వారి కుటుంబీకులు వైరస్‌ బారిన పడుతున్నారని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. కొత్తగా డెలివరీ బా య్స్‌ని నియమించుకున్నప్పటికీ, కరోనా నెగెటివ్‌ వచ్చిన తర్వాతే కంపెనీలు విధుల్లోకి తీసుకుంటున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఈ నియామకాలు మూడు రెట్లు పెరిగాయని తెలుస్తోంది. అంతరాయాలను తగ్గిం చడానికి డెలివరీ భాగస్వాములకు రెండింతల వేతనాలు, ప్రోత్సాహకాలతో పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే 2,000 పైచిలుకు నియామకాలను చేపట్టినట్టు వెల్లడించింది. మరో 7,000 మందిని చేర్చుకుంటామని వివరించింది. 2 గంటల్లో డెలివరీ సేవలు అందించిన అమెజాన్‌ ఫ్రెష్‌ సర్వీస్‌ ఢిల్లీలో ఒకరోజు సమయం తీసుకుంటోంది. అన్ని రకాల ఉత్పత్తులనూ హోమ్‌ డెలివరీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని అమెజాన్‌ కోరుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top