
వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ వెల్లడి
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో భారత్‌లో 8,000 మంది ప్రొఫెషనల్స్‌కు కృత్రిమ మేధ (ఏఐ) సంబంధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికాకు చెందిన బీపీవో సంస్థ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ (వీజీఎస్) తెలిపింది. కాంటాక్ట్ సెంటర్ ప్రక్రియలను మెరుగుపర్చే వీఅసిస్ట్ టూల్‌తో ఈ శిక్షణా కార్యక్రమం తమ సంస్థ అంతర్గతంగా సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని వివరించింది.
కస్టమర్ల నుంచి వచ్చే క్వెరీలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, విశ్లేషించుకుని, సముచిత కేటగిరీల కింద వర్గీకరించడం (కాంటాక్ట్ సెంటర్, కస్టమర్ సర్వీస్, వ్యాపార అవసరాలు) ద్వారా కంపెనీ సిబ్బంది తగిన పరిష్కార మార్గాలను అందించేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.
ఏఐ రాకతో దేశీ బీపీవో రంగంలో కూడా శరవేగంగా పెను మార్పులు వస్తున్నాయని వీజీఎస్ ప్రెసిడెంట్ గగన్ ఆరోరా తెలిపారు. అధునాతన టెక్నాలజీలు, ఏఐ దన్నుతో 2033 నాటికి ఈ విభాగం 280 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం 2025లో ఇది 139.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగులు, ఏఐ మధ్య సమతూకం సాధించడం ద్వారా ఏజెంట్ల పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు కస్టమర్లకు కూడా మరింత సంతృప్తికరమైన సేవలు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.