వారాంతాన యూఎస్‌ మార్కెట్లు డౌన్‌

US Markets down on weekend - Sakshi

7నానో మీటర్‌ చిప్‌ తయారీ ఆలస్యం

16 శాతం కుప్పకూలిన ఇంటెల్‌ కార్ప్‌ 

16 శాతం దూసుకెళ్లిన ఏఎండీ ఇంక్‌

క్యూ2 ఫలితాల నిరాశ- అమెక్స్‌ వీక్‌

చైనాతో వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో వారాంతాన యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీనికితోడు క్యూ2 ఫలితాలు నిరాశపరచడంతో సెంటిమెంటు బలహీనపడింది. దీంతో శుక్రవారం డోజోన్స్‌ 182 పాయింట్లు(0.7 శాతం) క్షీణించి 26.,470కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 20 పాయింట్ల(0.6 శాతం)వెనకడుగుతో 3,216 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ సైతం 98 పాయింట్ల(1 శాతం) నష్టంతో 10,363 వద్ద స్థిరపడింది.క్యూ2(ఏప్రిల్‌-జూన్‌)లో క్రెడిట్‌ కార్డ్స్‌ దిగ్గజం అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆదాయం 29 శాతం క్షీణించింది. మరోపక్క కోవిడ్‌-19 నేపథ్యంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న 7నానోమీటర్‌ చిప్స్‌ ఏడాది ఆలస్యంగా అందుబాటులోకి రానున్నట్లు చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌ కార్ప్‌వెల్లడించింది. వెరసి 2022 చివర్లో లేదా 2023లో మాత్రమే ఈ ఆధునిక చిప్స్‌ను విడుదల చేయగలమని పేర్కొంది. 

అమెక్స్‌ డీలా
బ్లూచిప్‌ దిగ్గజాలలో ఇంటెల్‌ కార్ప్‌ షేరు 16 శాతంపైగా కుప్పకూలి 50.6 డాలర్ల వద్ద ముగిసింది. ఆధునిక 7నానోమీటర్‌ చిప్‌ తయారీని ఆలస్యం చేయనున్నట్లు పేర్కొనడం ప్రభావం చూపింది. దీంతో ప్రత్యర్ధి సంస్థ అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైసెస్‌(ఏఎండీ)షేరుకి జోష్‌ వచ్చింది. 16.5 శాతం దూసుకెళ్లి 69 డాలర్లను తాకింది. మరోపక్క వైర్‌లెస్‌ సేవల దిగ్గజం వెరిజాన్‌ 2 శాతం పుంజుకుని 57 డాలర్లకు చేరింది. ఇక బ్యాంకింగ్‌ దిగ్గజం అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ షేరు 1.4 శాతం నష్టంతో 95.3 డాలర్ల వద్ద ముగిసింది. ఫాంగ్‌ స్టాక్స్‌లో ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ 0.5 శాతం చొప్పున నీరసించగా.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top