పిన్‌ అవసరం లేదు!.. పేమెంట్‌ ఫెయిల్‌ అయ్యే సమస్యే లేదు!

UPI payment without PIN - Sakshi

దేశీయ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ తన పేటీఎం యూపీఐ లైట్‌ (Paytm UPI LITE) యాప్‌ ద్వారా వన్‌ ట్యాప్‌ రియల్‌ టైమ్‌ యూపీఐ చెల్లింపులను ప్రారంభించింది. దీనివల్ల లావాదేవీలు ఎక్కువగా ఉండే సమయాల్లో చిన్న మొత్తంలో చేసే ఈ చెల్లింపులు విఫలమయ్యే ఆస్కారం ఉండదు. యూపీఐ పీర్ టు మర్చంట్ (పీ2ఎం) చెల్లింపులలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అగ్రగామిగా ఉంది.

ఇదీ చదవండి: ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్‌: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి!

పేటీఎం తాజాగా ప్రారంభించిన యూపీఐ లైట్‌ యాప్‌ ఆన్‌లైన్ లావాదేవీలను వేగవంతం చేయడానికి లింక్ చేసిన బ్యాంక్ ఖాతాను 'ఆన్-డివైస్' వాలెట్‌తో భర్తీ చేస్తుంది. అంటే పేటీఎం యూజర్లు లావాదేవీలు చేయడానికి వారి పేటీఎం వాలెట్ లాగే యూపీఐ లైట్ వాలెట్‌కు కూడా డబ్బును జోడించుకోవచ్చు.

ఒకసారికి ఎంత మొత్తం చేయొచ్చు?
ఈ సర్వీస్‌ను సెటప్ చేసుకున్న యూజర్లు పేటీఎం యూపీఐ లైట్ ద్వారా రూ. 200 వరకు తక్షణ చెల్లింపులు చేయవచ్చు. ఇందు కోసం ఎటువంటి పిన్‌ అవసరం లేదు. పేటీఎం  యూపీఐ లైట్ యూజర్లు  రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2,000 జోడించుకోవచ్చు. అంటే మొత్తంగా రూ. 4,000 యాడ్‌ చేసుకోవచ్చు. అయితే ఒకసారికి గరిష్టంగా రూ.200 వరకు మాత్రమే చెల్లింపు చేయవచ్చు. 

ఏయే బ్యాంకులు?
పేటీఎం యూపీఐ లైట్‌ యాప్‌కు ప్రస్తుతం 10 బ్యాంకులు మాత్రమే మద్దతిస్తున్నాయి.  అవి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.

సగానికి పైగా చిన్న మొత్తాలే..
నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌(ఎన్‌పీసీఐ)  2022 మేలో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం యూపీఐ లావాదేవీలలో 50 శాతం రూ. 200 అంతకంటే తక్కువ మొత్తానివే. ఇటువంటి చిన్న మొత్తం లావాదేవీలు భారీ సంఖ్యలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్యవస్థను ఆక్రమించాయి. దీంతో యూపీఐ లావాదేవీలు కొన్ని సార్లు నిలిచిపోతున్నాయి. 

రూ. 100 క్యాష్‌బ్యాక్‌
చిన్న మొత్తాల్లో చేసిన యూపీఐ చెల్లింపులు కస్టమర్ల బ్యాంక్ పాస్‌బుక్‌లను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఐ లైట్ ద్వారా చేసే చెల్లింపులు బ్యాంక్ పాస్‌బుక్‌లో కనిపించవు. ఈ చెల్లింపులను పేటీఎం బ్యాలెన్స్, హిస్టరీ విభాగంలో చూసుకోవచ్చు. పేటీఎం యూపీఐ లైట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. యూపీఐ లైట్‌ సర్వీస్‌ను యాక్టివేట్‌ చేసుకునే యూజర్లకు పేటీఎం రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.

ఇదీ చదవండి: Fact Check: ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్‌! నిజమేనా?

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top