
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) దేశవ్యాప్తంగా 1.4 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. ఇవన్నీ చనిపోయినవారికి సంబంధించిన ఆధార్ నంబర్లు. గుర్తింపు మోసాన్ని నిరోధించడానికి, ప్రభుత్వ ప్రయోజనాలు సరైన చేతుల్లోకి వెళ్లేలా చూడటానికి గత ఏడాది ప్రారంభించిన క్లీన్ అప్ డ్రైవ్ కింద ఈ ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది.
సంక్షేమ పథకాల విశ్వసనీయతను కాపాడటానికి, దుర్వినియోగాన్ని నివారించడానికి మృతుల ఆధార్ నంబర్లను (Aadhaar) డీయాక్టివేట్ చేయడం చాలా అవసరమని యూఐడీఏఐ సీఈవో భువనేష్ కుమార్ అన్నారు. నకిలీ క్లెయిమ్‌లు లేదా గుర్తింపు మోసం ద్వారా ప్రభుత్వ నిధులు స్వాహా కాకుండా ఇది నిర్ధారిస్తుందన్నారు.
డిసెంబర్ నాటికి 2 కోట్ల ఆధార్ నంబర్లు
ఆధార్ క్లీనప్ డ్రైవ్‌ను 2024 మధ్యలో ప్రారంభించారు. ఇది నిరంతర ప్రక్రియ. వచ్చే డిసెంబర్ నాటికి 2 కోట్ల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని యూఐడీఏఐ లక్ష్యంగా పెట్టుకుందని మరో సీనియర్ అధికారి తెలిపారు. ఆధార్ ప్రక్షాళన కార్యక్రమం కీలకమైనప్పటికీ, సవాళ్లతో నిండి ఉందని, మరణ నమోదుకు ఆధార్ తప్పనిసరి కాకపోవడం అతిపెద్ద అడ్డంకులలో ఒకటి ఆ అధికారి పేర్కొన్నారు.
మరణాల డేటాను యూఐడీఏఐ పలు మార్గాల ద్వారా సంగ్రహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) ద్వారా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) రికార్డులను వినియోగించుకుంటోంది. కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పంజాబ్, పుదుచ్చేరి, గోవా, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి స్వతంత్రంగానూ డేటాను సేకరిస్తోంది. ఆధార్ డేటాను అప్డేట్ చేయడానికి బ్యాంకులు, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అధికారులతో కలిసి పనిచేస్తోంది.
ఇదీ చదవండి: జియో పేమెంట్స్ బ్యాంక్ వినూత్న అకౌంట్