క్రికెట్‌ బాల్‌ దెబ్బ- ఉదయ్‌ కొటక్‌కు భలే ప్లస్

Uday Kotak turns richest banker after leaving cricket ambition - Sakshi

యుక్త వయసులో ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ కావాలన్నదే లక్ష్యం

20 ఏళ్లప్పుడు క్రికెట్ బాల్‌ తలకు తగలడంతో అత్యవసర సర్జరీ

తదుపరి కొంత కాలం కాటన్‌ బిజినెస్‌- ఆపై ఎంబీఏ డిగ్రీవైపు దృష్టి

26 ఏళ్ల వయసులో ఫైనాన్స్ రంగంలో తొలి అడుగు

ప్రస్తుతం ప్రపంచంలోనే సంపన్న బ్యాంకర్‌ ఉదయ్‌ కొటక్‌

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సీఈవో సంపద 16 బిలియన్‌ డాలర్లు!

ముంబై, సాక్షి: విధి చేసే విచిత్రాలు ఒక్కొక్కప్పుడు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఒకప్పుడు ప్రొఫెషనల్‌ క్రికెటర్‌కావాలని కన్న కలలు బాల్‌ దెబ్బకు ఆవిరికాగా.. తదుపరి ఫైనాన్షియల్‌ రంగంవైపు అడుగులేసేందుకు దోహదపడింది. ఫలితంగా ప్రస్తుతం ప్రపంచంలోనే సంపన్న బ్యాంకర్‌గా ఆ వ్యక్తి ఆవిర్భవించారు. ఆయన పేరు ఉదయ్‌ కొటక్. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఇతర వివరాలు చూద్దాం..

మరణం అంచులవరకూ
క్రికెట్‌ బాల్‌ వల్ల తలకు దెబ్బ తగలడంతో 20 ఏళ్ల వయసులో ఉదయ్‌ కొటక్‌కు అత్యవసర సర్జరీ చేశారు. మరణం అంచులవరకూ వెళ్లడంతో ఆపై ఆయన క్రికెట్‌ ఆశలు అడియాసలయ్యాయి. అయితే ఇది ఆయనకు ఎంతో మేలు చేసిందంటున్నారు విశ్లేషకులు. క్రికెట్‌ ఆశయాలను వీడి కుటుంబీకులు నిర్వహిస్తున్న కాటన్‌ బిజినెస్‌లో ఉదయ్‌ కొటక్‌ ప్రవేశించారు. ఆపై జమన్‌లాల్‌ బజాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఎంబీఏ డిగ్రీ చేశారు. తదుపరి 1985లో 26 ఏళ్ల వయసులో ఫైనాన్స్‌ రంగంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ప్రయివేట్‌ రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్‌ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయ్‌ కొటక్ సంపద 16 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 1.17 లక్షల కోట్లు)గా బ్లూమ్‌బెర్గ్‌ అంచనా.

సవాళ్ల కాలంలోనూ
కొన్నేళ్లుగా ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్‌ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. పలు సంస్థలు మొండిబకాయిలతో డీలాపడగా, కొన్ని కంపెనీలను కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యలు కుంగదీస్తున్నాయి. దీనికితోడు ఇటీవల కోవిడ్‌-19 కారణంగా ఫైనాన్షియల్‌ రంగం పలు ఇబ్బందుల్లో పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే రిస్కులు అధికంగా ఉన్న రంగాలకు తక్కువ రుణ మంజూరీ, పారదర్శక పాలన వంటి కార్యకలాపాలతో కొటక్ మహీంద్రా బ్యాంక్‌ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పొందినట్లు తెలియజేశారు. ఇటీవల నిధుల సమీకరణ ద్వారా బ్యాలన్స్‌షీట్‌ను పటిష్టపరచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. (30 రోజుల్లో 100 శాతం లాభాలు)

షేరు జూమ్‌
ఈ ఏడాది ఇప్పటివరకూ కొటక్ మహీంద్రా బ్యాంక్‌ షేరు 17 శాతం బలపడింది. ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే ఇది అత్యధికంకాగా.. ప్రస్తుతం షేరు రూ.1940 వద్ద ట్రేడవుతోంది. దీంతో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ తాజాగా రూ. 3.84 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా రెండో పెద్ద బ్యాంక్‌గా నిలుస్తోంది. గత మూడేళ్లలోనూ కొటక్ బ్యాంక్‌ షేరు 24 శాతం చొప్పున ర్యాలీ చేయడం విశేషం! 2020లో మొండి రుణాల విషయంలో రెండో ఉత్తమ బ్యాంకుగా నిలిచినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో పటిష్ట సీఏఆర్‌ను కలిగి ఉన్నట్లు తెలియజేశాయి. ఇటీవలే ఉదయ్‌ కొటక్ సీఈవో పదవీకాలం పొడిగింపునకు ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అంతేకాకుండా బ్యాంకుల వ్యవస్థాపకులు వాటాను పెంచుకునేందుకూ ఆర్‌బీఐ ఇటీవల ప్రతిపాదించడంతో ఈ కౌంటర్‌కు బూస్ట్‌ లభించినట్లు వివరించారు. (యాక్సెంచర్‌ పుష్‌- ఐటీ షేర్లు గెలాప్‌)

మహీంద్రాతో జట్టు
1985లో పశ్చిమ గుజరాత్‌లో కుటుంబీకులు, స్నేహితులు అందించిన  రూ. 30 లక్షల రుణాలతో కొటక్‌ ఫైనాన్షియల్‌ సేవల కంపెనీని ప్రారంభించారు. 1986లో డైవర్సిఫైడ్‌ దిగ్గజం మహీంద్రా గ్రూప్‌తో కొటక్ జత కట్టారు. ఫలితంగా కొటక్ మహీంద్రా బ్యాంక్‌ ప్రస్థానానికి బీజం పడింది. తొలుత బిల్‌ డిస్కౌంటింగ్‌తో ప్రారంభమై, స్టాక్‌ బ్రోకింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌, బీమా, మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితరాలకు కార్యకలాపాలు విస్తరించింది. 2003కల్లా ఆర్‌బీఐ నుంచి బ్యాంకింగ్‌ లైసెన్స్‌ను పొందింది. అయితే బ్యాంకు నిర్వహణలో కుటుంబీకులకు కాకుండా ప్రొఫెషనల్స్‌కే చోటివ్వడం ద్వారా ఉదయ్‌ కొటక్‌ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పొందుతూ వచ్చారని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top