ఫోర్బ్స్‌ ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితా.. ఇద్దరు భారతీయులకు చోటు

Two Indian Got Forbes List Of 100 Most Powerful Women - Sakshi

The World's 100 Most Powerful Women 2021 in the World List: ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ పత్రిక ప్రచురించే ప్రపంచ శక్తివంతులైన మహిళల జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. ప్రతీ ఏడు ఫోర్బ్స్‌ పత్రిక ప్రపంచ వ్యాప్తంగా పాలసీ మేకర్స్‌, వ్యాపారం, దాతృత్వం, సీఈవోలు ఇలా వివిధ కేటగిరిలకు చెందిన మహిళలను పరిశీలించి ఈ జాబితాను ప్రకటిస్తుంది.

ఇద్దరికి చోటు
తాజాగా ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, నైకా ఫౌండర్‌ ఫాల్గుని నాయర్‌కు చోటు దక్కించుకున్నారు. వంద మంది మహిళలతో కూడిన ఈ జాబితాలో నిర్మలా సీతారామన్‌ 37వ స్థానంలో నిలవగా ఫాల్గుని నాయర్‌ 88వ స్థానంలో నిలిచారు.

బీబీసీ నుంచి
భారత రాజకీయ చరిత్రలో తొలిసారిగా మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ గుర్తింపు పొందారు. అంతకు ముందు ఆమె రక్షణ శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె బీబీసీలో పని చేశారు.

సెల్ఫ్‌మేడ్‌ 
నైకా ఐపీవోతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు ఫాల్గుని నాయర్‌. బ్యూటీ ప్రొడక్టులు వ్యాపారంలోకి వచ్చిన ఫాల్గుని నాయర్‌ అనతి కాలంలోనే మార్కెట్‌లో మంచి పేరు సాధించారు. ఇటీవల ఐపీవోకి వచ్చిన మరుసటి రోజే బిలియనీర్‌గా మారారు. సెల్ఫ్‌మేడ్‌ ఇండియన్‌ ఫిమేల్‌ బిలియనీర్‌గా రికార్డులకెక్కారు. 

మొదటి స్థానంలో మెకెంజీ
ఇక ఫోర్బ్స్‌ శక్తివంతమైన మహిళల జాబితాలో తొలి స్థానంలో మెకెంజీ స్కాట్‌ నిలిచారు. అమెరికన్‌ నావెలిస్ట్‌ అయిన మెకెంజీ స్కాట్‌ అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బేజోస్‌ మాజీ భార్య. కాగా దాతృత్వం విభాగంలో ఆమె చేసిన ఛారిటీ సేవలకు గాను ఫోర్బ్స్‌ ఈ గుర్తింపు ఇచ్చింది. కాగా గత జాబితాలో తొలి స్థానంలో ఉన్న జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మార్కెల్‌ ఈసారి 15వ స్థానంలో నిలిచారు.

చదవండి: ‘ఫోర్బ్స్‌’ లిస్ట్‌లో ఆశా వర్కర్‌.. ఎందుకంటే..?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top