రియల్ ఎస్టేట్ రంగం ఢీలా, కానీ వీటికి మాత్రం భారీగా పెరిగిన డిమాండ్‌!

Total Office Space Leasing In May Jumps Nearly 3 Fold Across - Sakshi

న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాలకు (ఆఫీస్‌ స్పేస్‌) మే నెలలో డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా మూడింతలు పెరిగి 6.1 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ ఓ నివేదిక విడుదల చేసింది. కార్యాలయాలకు తిరిగి వచ్చి పనిచేయడం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడమే డిమాండ్‌ ఇంతలా వృద్ధి చెందడానికి కారణమని పేర్కొంది. 2021 మే నెలలో ఆఫీస్‌ స్పేస్‌ లీజు 2.2 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. అప్పుడు కరోనా రెండో విడత ప్రభావం చూపించడం గమనార్హం. 

హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా నగరాల్లోని గణాంకాలను జేఎల్‌ఎల్‌ ఇండియా తన నివేదికలో చోటు కల్పించింది. ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై నగరాలు మే నెల మొత్తం ఆఫీసు స్పేస్‌ లీజులో 91 శాతం వాటా ఆక్రమించాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో స్థూల ఆఫీసు స్పేస్‌ లీజు 4.8 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఆఫీస్‌ గ్రేడ్‌ ఏ (ప్రీమియం/ఖరీదైన) స్పేస్‌ లీజు మార్చి చివరికి 732 మిలియన్‌ చరదపు అడుగులుగా ఉంది. దీంతో మొత్తం లీజు స్థలం 1.1 బిలియన్‌ చదరపు అడుగులకు చేరింది.  

మాంద్యం ఒత్తిళ్లు ఉంటాయేమో చూడాలి.. 
భౌతికంగా పనిచేసే ప్రదేశాలు కంపెనీలకు ప్రాధాన్యంగా ఉండడమే డిమాండ్‌ పెరగడానికి కారణమని జేఎల్‌ఎల్‌ ఇండియా రీసెర్చ్‌ హెడ్‌ సమంతక్‌దాస్‌ తెలిపారు. ‘‘కరోనా ఇన్ఫెక్షన్లు తగ్గిపోవడం, టీకాలను పూర్తిస్థాయిలో ఇవ్వడం, ఆర్థిక కార్యకలపాలను పూర్థి స్థాయిలో అనుమతించడం, రవాణా, పౌరుల కదలికలపై ఎటువంటి ఆంక్షల్లేకపోవడం.. రియల్‌ ఎస్టేట్‌ ప్రణాళికలపై మరింత స్పష్టతకు వీలు కల్పించింది’’అని దాస్‌ చెప్పారు.

అయితే, రానున్న నెలల్లో ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌పై ప్రభావం ఉండొచ్చన్నారు. ‘‘అంతర్జాతీయంగా అధిక స్థాయిలో ద్రవ్యోల్బణం, మాంద్యం ఒత్తిళ్లు కార్యాలయ స్థలాల డిమాండ్‌పై ఏ మేరకు ఉంటాయో రానున్న కాలంలో మేము సమీక్షిస్తుంటాం. అయితే ఐటీకి ప్రధాన కేంద్రంగా ఉండడం, అవుట్‌సోర్సింగ్‌ వల్ల భారత్‌ ప్రయోజనం పొందొచ్చు’’అని చెప్పారు. భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యయాలు తక్కువగా ఉండడం, పుష్కలమైన నైపుణ్యాలు కార్యాలయ స్థలాల డిమాండ్‌ను నడిపించే కీలక అంశాలుగా పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top