130 అగ్రశ్రేణి గ్లోబల్ క్లయింట్లతో భాగస్వామ్యం
భారతీయ ఐటీ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీగా అవతరించడమే తమ అంతిమ లక్ష్యమని దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించింది. కంపెనీ వార్షిక నివేదిక (2025-26)లో భాగంగా వాటాదారులకు రాసిన లేఖలో టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కె.కృతివాసన్ ఈ కీలక విషయాలను వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో ఏఐ సాంకేతికతకు ఒక కీలక మలుపు అన్నారు. క్లయింట్లు కేవలం ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా తమ వ్యాపార సామ్రాజ్యాల్లో పెద్ద ఎత్తున ఏఐని విస్తరిస్తున్నారని స్పష్టం చేశారు.
టాప్ క్లయింట్ల మొదటి ఛాయిస్..
టీసీఎస్ గ్లోబల్ మార్కెట్‌లో తన పట్టును ఎంత బలంగా నిలుపుకుందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఏడాదికి 50 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందించే కంపెనీ అగ్రశ్రేణి 139 క్లయింట్లలో.. ఏకంగా 130 మంది తమ ఏఐ సేవల భాగస్వామిగా టీసీఎస్‌ను ఎంచుకున్నారని కృతివాసన్ ప్రకటించారు.
‘ఏఐ సృష్టిస్తున్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ-నేతృత్వంలోని టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీగా మారాలనే సాహసోపేతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మౌలిక సదుపాయాలు నుంచి ఇంటెలిజెన్స్ వరకు ఫుల్ స్టాక్ ఏఐ సేవలను అందించడమే మా వ్యూహం’ అని కృతివాసన్ చెప్పారు.
మూడు రెట్లు పెరిగిన ఏఐ శ్రామిక శక్తి
ఈ భారీ సాంకేతిక మార్పును తట్టుకునేందుకు వీలుగా టీసీఎస్ తన శ్రామిక శక్తిని దూకుడుగా సన్నద్ధం చేస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 2,70,000 మందికి పైగా ఉద్యోగులు అధునాతన ఏఐ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం.
డిజిటల్ ప్రాజెక్టులు..
గ్లోబల్ మార్కెటతోపాటు భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో టీసీఎస్ అత్యంత కీలక పాత్ర పోషించిందని సీఈఓ హైలైట్ చేశారు.
గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్: రూ. 5 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వ కొనుగోళ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌గా దీనిని విస్తరించింది.
ఎస్‌బీఐ యోనో 2.0: 10 భాషల్లో ఏకంగా 20 కోట్ల మంది వినియోగదారులకు అత్యంత వేగవంతమైన సేవలు అందించేలా దీనిని అప్‌గ్రేడ్ చేసింది.
ఈ-పాస్‌పోర్ట్: కోటికి పైగా ఈ-పాస్‌పోర్ట్‌ల జారీతో పౌర సేవలను ఆధునీకరించింది.
ఆర్‌బీఐ డేటా మేనేజ్‌మెంట్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక విశ్లేషణల కోసం 250 టీబీ డేటాను నిర్వహించగల అత్యాధునిక డేటా మేనేజ్మెంట్ సిస్టమ్‌ను నిర్మించింది.
ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు


