
ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇచ్చి ఉద్యోగంలోకి చేర్చుకోకుండా తిప్పలు పెడుతోందంటూ దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఆ మధ్య కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కూడా ఇలాగే చేస్తోందని ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.
600 మందికి పైగా అనుభవజ్ఞులైన ఉద్యోగుల లేటరల్ నియామకాల్లో టీసీఎస్ జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది. ఈ ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్‌పై ఎటువంటి కమ్యూనికేషన్ లేదని, దీంతో చాలా మంది టెక్కీలు ఇబ్బంది పడుతున్నారని మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది.
ఆన్ బోర్డింగ్ ప్రక్రియల్లో ఈ 'నిరవధిక జాప్యం' ప్రభావాన్ని ఎత్తిచూపుతూ కార్మిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని ఎన్ఐటీఈఎస్ కోరింది. అధికారిక ఆఫర్ లెటర్ ఉన్నప్పటికీ ఉద్యోగంలో చేర్చుకోకపోవడం ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. ప్రభావితమైనవారిలో రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల అనుభవం ఉన్న వారు ఉన్నారని లేఖలో తెలిపింది. ఈ ఉద్యోగులు తమ మునుపటి సంస్థకు అధికారికంగా రాజీనామా చేశారని, ప్రస్తుతం వీరు ఇటు టీసీఎస్ ఉద్యోగంలో చేర్చుకోకపోవడం, వేరే ఉద్యోగమూ లేకపోవడంతో ఈఎంఐలు, అద్దెలు, వాయిదాలు చెల్లించడం కష్టమవుతోంది.
దీనిపై టీసీఎస్ ఏమంటోందంటే..
ఆఫర్ లెటర్ అందుకున్న ప్రతి ఒక్కరినీ ఆన్‌బోర్డ్ చేస్తామని టీసీఎస్ పునరుద్ఘాటిస్తోంది. ‘ఫ్రెషర్స్ లేదా అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ ఇచ్చిన అన్ని ఆఫర్లను గౌరవించడానికి టీసీఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మేము ధృవీకరించగలము. టీసీఎస్ నుంచి ఆఫర్ వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆన్‌బోర్డ్ చేస్తాం. వ్యాపార డిమాండ్ ప్రకారం జాయినింగ్ తేదీలు నిర్ణయించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో, అవి వ్యాపార అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంటాం. ఈ సందర్భాల్లో అభ్యర్థులందరితో నిరంతరం టచ్ లో ఉంటామని, వారిని త్వరలోనే సంస్థలో చేర్చుకునేందుకు చూస్తుంటాం’ అని కంపెనీ తెలిపింది.
ఆలస్యమైన అభ్యర్థుల ఆన్‌బోర్డింగ్‌కు సంబంధించి స్పష్టమైన కాలపరిమితి కోసం టీసీఎస్‌పై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ఎన్ఐటీఈఎస్ అధికారికంగా కార్మిక మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. వెయిటింగ్ పీరియడ్ కు ఆర్థిక పరిహారం, టీసీఎస్ ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఈఏపీ) ద్వారా మానసిక ఆరోగ్య మద్దతుకు ప్రాప్యత, బాధితులకు కంపెనీలో ప్రత్యామ్నాయ పాత్రలను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ఐటీఈఎస్ డిమాండ్ చేస్తోంది.
👉 ఇదీ చదవండి: ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం