ఎయిర్‌ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్‌

Tata Sons Win The Air India Bid - Sakshi

ఎయిర్‌ ఇండియా సంస్థ టాటా సన్స్‌ పరమైంది. పెట్టుబడుల ఉపసంహారణలో భాగంగా ఎయిర్‌ ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా స్పైస్‌ జెట్‌తో పాటు ఎయిర్‌ ఇండియా కూడా బిడ్‌ను దాఖలు చేసింది. రెండు బిడ్లను పరిశీలించిన కేంద్ర మంత్రుల బృందం చివరకు టాటా సన్స్‌కే మొగ్గు చూపింది. ఎయిర్‌ ఇండియాను సొంతం చేసుకునేందుకు టాటా సన్స్‌ రూ. 18,000 కోట్లను వెచ్చించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్​) కార్యదర్శి తహిన్​ కాంత పాండే అధికారికంగా ప్రకటించారు. 

ఇదీ ప్రస్థానం
1946లో టాటా సన్స్‌ ఏవియేషన్‌ విభాగం ఎయిరిండియాగా లిస్టయ్యింది. 1948లో యూరప్‌కు విమాన సేవలతో ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ ఏర్పాటైంది. దేశీయంగా ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యానికి ఈ ఇంటర్నేషనల్‌ సర్వీసే నాం ది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49 శాతం, టాటాలకు 25 శాతం, మిగతా వాటా పబ్లిక్‌ దగ్గర ఉండేది. 1953లో ఎయిరిండియాను కేంద్రం జాతీయం చేసింది. 1990లు, 2000ల దాకా ఎయిరిండియా ఆధిపత్యం కొ నసాగినా ఆ తర్వాత ప్రైవేట్‌ సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గడం మొదలైంది.

2017 నుంచి అమ్మకానికి
ఎయిరిండియా 2007 నుంచి నష్టాల్లోనే కొనసాగుతోంది. భారీ రుణభారంలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు 2017 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో కంపెనీని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో.. కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) నిబంధనలను సడలించింది. 

పోటీలో ఇద్దరు
ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు ఆసక్తి ఉన్న కంపెనీలు బిడ్‌ దాఖలు చేసేందుకు రెండోసారి కేంద్రం బిడ్లను ఆహ్వానించింది. 2021 సెప్టెంబరు 15 చివరి తేదీగా నిర్ణయించింది. ఈసారి టాటా సన్స్‌తో పాటు స్పైస్‌ జెట్‌ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో టాటా సన్స్‌ అత్యధికంగా రూ. 18,000 కోట్లతో బిడ్‌ సమర్పించింది.

68 ఏళ్ల తర్వాత
ఎయిరిండియా ప్రస్థానం .. 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ గా ప్రారంభమైంది.  జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌ (జేఆర్‌డీ) దీన్ని నెలకొల్పారు. తొలినాళ్లలో దీన్ని బాంబే, కరాచీ మధ్య పోస్టల్‌ సర్వీసులకు ఉపయోగించారు. ఆ తర్వాత ప్రయాణికులకు విమాన సర్వీసులను ప్రారంభించాక కంపెనీ చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.  స్వాతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. ఎయిర్‌ ఇండియాకు చెందిన మహారాజా మస్కట్‌తో ఎంతో ప్రాచుర్యం పొందింది. 2007 వరకు లాభాలో ఉన్న సంస్థ ఆ తర్వాత నష్టాలకే కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. దీంతో అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. చివరకు 68 ఏళ్ల తర్వాత తిరిగి టాటా గూటికే ఎయిర్‌ ఇండియా చేరింది. ప్రైవేటు పరం అయ్యేనాటికి  ఎయిరిండియా రుణం రూ. 60,074 కోట్లుగా ఉంది. 

చదవండి : అమ్మకానికి కసరత్తు, అప్పుల ఊబిలో ఎయిర్‌ ఇండియా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top