Tata Altroz CNG: భారత్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్‌జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!

Tata altroz cng launched india price features boot space and photos - Sakshi

Tata Altroz CNG: ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సిఎన్‌జి కార్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో ఆల్ట్రోజ్ సిఎన్‌జి (Altroz CNG) విడుదల చేసింది. ఈ లేటెస్ట్ సిఎన్‌జి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధరలు & వేరియంట్స్
టాటా మోటార్స్ విడుదల చేసిన ఆల్ట్రోజ్ సిఎన్‌జి ఆరు వేరియంట్లలో లభిస్తుంది. అవి XE, XM+, XM+ (S), XZ, XZ+ (S), XZ+ O (S) వేరియంట్లు. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ. 7.55 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 10.55 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

దేశీయ విఫణిలో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్‌జి సన్‌రూఫ్‌ కలిగిన మొదటి CNG బేస్డ్ హ్యాచ్‌బ్యాక్. ఇందులో డ్యూయెల్ సిలిండర్ సెటప్‌ కలిగి ఉంటుంది, కావున దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇందులో 210 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్ ఆల్ట్రోజ్ బూట్ స్పేస్ 345 లీటర్లు.

డిజైన్ & ఫీచర్స్
ఆల్ట్రోజ్ CNG కారు చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. కానీ దీని టెయిల్‌గేట్‌పై 'iCNG' బ్యాడ్జ్‌ ఇది కొత్త మోడల్ అని చెప్పకనే చెబుతుంది. బూట్ ప్లోర్ కింద రెండు సిఎన్‌జి ట్యాంకులు ఉంటాయి. సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ దాదాపు పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవనే చెప్పాలి. కావున అదే 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ కలిగి.. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి వారికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌ కూడా లభిస్తాయి. XM+ (S), XZ+ (S), XZ+ O (S) వేరియంట్లలో వాయిస్ యాక్టివేటెడ్ సింగిల్-పేన్ సన్‌రూఫ్ లభిస్తుంది. కావున ఇది దాని ఇతర వేరియంట్ల కంటే భిన్నంగా ఉంటుంది.

(ఇదీ చదవండి: భారత్‌లో 5 డోర్ జిమ్నీ లాంచ్ డేట్ ఫిక్స్ - బుక్ చేసుకున్న వారికి పండగే)

పవర్‌ట్రెయిన్
ఆల్ట్రోజ్ సిఎన్‌జి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఇది 88 హార్స్ పవర్, 115 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక సిఎన్‌జి మోడ్‌లో 77 hp పవర్, 103 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దాని పెట్రోల్ వెర్షన్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!)

ప్రత్యర్థులు
ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి ఇప్పటికే అమ్ముడవుతున్న మారుతి బాలెనొ సిఎన్‌జి, టయోటా గ్లాంజా సిఎన్‌జి వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా తప్పకుండా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top