మాకు తిరుగులేదు..ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌లో అదరగొట్టేస్తున్నాం!!

Swiggy's Food Delivery Business Turns Profitable Said Ceo Sriharsha Majety - Sakshi

న్యూఢిల్లీ: స్విగ్గీ ఫుడ్‌ వ్యాపారం లాభాల్లోకి ప్రవేశించినట్టు కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజేటి ప్రకటించారు. కంపెనీ ఏర్పాటైన తొమ్మిదేళ్ల లోపే ఈ మైలురాయిని చేరుకున్నామని, అంతర్జాతీయంగా ఈ ఘనత సాధించిన కేవలం కొన్ని కంపెనీల్లో స్విగ్గీ ఒకటిగా ఉన్నట్టు తెలిపారు. ఫుడ్‌ డెలివరీ, రెస్టారెంట్లకు వెళ్లి తినడం పట్ల తాము బుల్లిష్‌గా ఉన్నట్టు బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు.

వచ్చే రెండు దశాబ్దాల కాలానికి వృద్ధి సామర్థ్యాల పట్ల స్విగ్గీ ఎంతో ఆశావహంగా ఉందని ప్రకటించారు. ఫుడ్‌ డెలివరీలో ఇక ముందూ వృద్ధిని కొనసాగిస్తామన్నా రు. ‘‘ఆవిష్కరణలపై మా తీక్షణ దృష్టి, బలమైన నిర్వహణ మరో మైలురాయిని చేరుకోవడానికి తోడ్పడ్డా యి. 2023 మార్చి నాటికి స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ వ్యాపారం లాభదాయంగా మారింది (అన్ని వ్యయాలు కలిపి చూసుకుంటే)’’అని శ్రీహర్ష వెల్లడించారు.

ఈ మైలురాయిని చేరుకోవడంలో సాయపడిన భాగస్వాములు అందరికీ అభినందనలు తెలిపారు. కస్టమర్లతో స్విగ్గీకి బలమైన అనుబం ధం ఉన్నట్టు చెప్పారు. పరిశ్రమలోనే మెరుగైన రిపీట్, రిటెన్షన్‌ (కస్టమర్ల నుంచి మళ్లీ ఆర్డర్లు పొందడం, కస్టమర్లను నిలబెట్టుకోవడంలో) రేటు ను కలిగి ఉన్నట్టు చెప్పారు. ద్వితీయ, తృతీ య శ్రేణి పట్టణాల్లో కస్టమర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. స్విగ్గీతో రెస్టారెంట్‌ భాగస్వాముల అనుభవం కూడా మెరుగ్గా ఉందంటూ, ఇది పరస్పర విజయంగా పేర్కొన్నారు. 

ఆరంభంలోనే ఉన్నాం:
2014లో స్విగ్గీ ఫుడ్‌ డెలివరీని ప్రధాన వ్యాపారంగా మొదలు పెట్టినప్పడు, చాలా మంది దీన్ని గిట్టుబాటు కాని వ్యాపార నమూనాగా భావించినట్టు శ్రీహర్ష తెలిపారు. కానీ, ఇంత కాలం తాము చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం మొదలైందన్నారు. ‘‘ఈటింగ్‌ అవుట్‌ (రెస్టారెంట్లతో తినడం/డైన్‌ అవుట్‌), ఫుడ్‌ డెలివరీ వ్యాపారం భారత్‌లో ఇంకా ఆరంభ దశలోనే ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. వచ్చే రెండు దశాబ్దాల పాటు వృద్ధి పట్ల ఆశాభావంతో ఉన్నాం.

ఫుడ్‌ డెలివరీ మరింత వృద్ధి చెందేందుకు బాధ్యతాయుత, కావాల్సిన చర్యలు చేపడతాం. దేశంలో ఇంకా సేవలు అందని ప్రాంతాలు, వినియోగ వర్గాలు చాలానే ఉన్నాయి. సరైన విభాగాల్లో పెట్టుబడులు పెడుతూ పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిని సాధించడమే మా లక్ష్యం’’అని శ్రీహర్ష తెలిపారు. క్విక్‌కామర్స్‌ వ్యాపారం విషయంలోనూ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు ప్రకటించారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ నేడు క్విక్‌ కామర్స్‌లో ప్రముఖ సంస్థగా ఉన్నట్టు చెప్పారు.

పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ముగిసినట్టేనని స్పష్టం చేశారు. ఇన్‌స్టామార్ట్‌ను లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా మంచి పురోగతి సాధించామని, వచ్చే కొన్ని వారాల్లో తటస్థ స్థితికి చేరుకుంటామన్నారు. డైన్‌ అవుట్‌ విభాగంలోనూ తాము లీడర్‌గా ఉన్నట్టు చెప్పారు. 34 పట్టణాల్లో తమకు 21,000 రెస్టారెంట్‌ భాగస్వాములు ఉన్నట్టు తెలిపారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top