సాధారణంగా 22 ఏళ్ల వయసు అంటే కెరీర్‌ను ఇప్పుడిప్పుడే మలుచుకునే దశ. కానీ, భారత సంతతికి చెందిన సూర్య మిధా ఆలోచనలు మాత్రం ప్రపంచ కుబేరుల జాబితాను సవాల్ చేస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) విప్లవాన్ని అందిపుచ్చుకున్న ఈ యువ పారిశ్రామికవేత్త కేవలం 22 ఏళ్లకే సుమారు 2.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.18,000 కోట్లు) నికర విలువతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ‘సెల్ఫ్ మేడ్ బిలియనీర్’గా అవతరించారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ నెలకొల్పిన రికార్డును సైతం ఆయన అధిగమించడం విశేషం.
జుకర్‌బర్గ్ కంటే వేగంగా..
గతంలో మార్క్ జుకర్‌బర్గ్ తన 23వ ఏట బిలియనీర్ క్లబ్‌లో చేరగా సూర్య మిధా అంతకంటే ఒక ఏడాది ముందుగానే (22 ఏళ్లకే) ఈ మైలురాయిని చేరుకున్నారు. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితా ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కులైన సెల్ఫ్ మేడ్ బిలియనీర్లలో ఒకరిగా ఆయన చరిత్ర సృష్టించారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో కాకుండా కేవలం తన వినూత్న ఏఐ స్టార్టప్ ద్వారా ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం.
విజయానికి బాటలు
సూర్య మిధా తన స్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్‌లతో కలిసి స్థాపించిన ‘మెర్కోర్’ సంస్థ ఈ అద్భుత విజయానికి కీలకంగా నిలిచింది. ఇది సాధారణ నియామక సంస్థ కాదు. పూర్తిగా కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ప్లాట్‌ఫారమ్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వగల, పరిశోధన చేయగల నిపుణులను గుర్తించి పెద్ద కంపెనీలకు అనుసంధానిస్తుంది. అభ్యర్థుల నైపుణ్యాలను అంచనా వేయడం నుంచి ఇంటర్వ్యూల నిర్వహణ వరకు ప్రతి దశలోనూ ఏఐని ఉపయోగిస్తుంది. ఈ ఆటోమేషన్ ప్రక్రియ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది.
మెరుపు వేగంతో వాల్యుయేషన్
పెట్టుబడిదారుల నమ్మకమే మెర్కోర్ విజయ రహస్యం. బెంచ్‌మార్క్, ఫెలిసిస్, జనరల్ క్యాటలిస్ట్ వంటి దిగ్గజ సంస్థల మద్దతుతో ఈ స్టార్టప్ విలువ ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లకు చేరింది. మార్చి 2025లో 100 మిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ వార్షిక ఆదాయం, సెప్టెంబర్ నాటికే 500 మిలియన్ డాలర్లకు పెరగడం ఏఐ రంగంలోనే ఒక రికార్డు.
సిలికాన్ వ్యాలీలో కొత్త ఒరవడి
సూర్య మిధా ప్రస్థానం విలక్షణమైనది. చర్చా వేదికల్లో పరిచయమైన ముగ్గురు మిత్రులు తమ స్టార్టప్ కల కోసం కళాశాల చదువును మధ్యలోనే ఆపేసి సిలికాన్ వ్యాలీలో అడుగుపెట్టారు. నేడు ఏఐ రంగం కేవలం చాట్‌బాట్‌లకే పరిమితం కాకుండా.. రిక్రూట్‌మెంట్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఎలా విప్లవం తీసుకురాగలదో మెర్కోర్ నిరూపించింది. భవిష్యత్తు అంతా ఏఐదే అని ఐటీ నిపుణులు చెబుతున్న మాటలను సూర్య మిధా నిజం చేసి చూపించారు. భారత సంతతికి చెందిన ఈ యువకుడి విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు


