2025-26కు నష్టాల వీడ్కోలు.. బేర్‌ బాజా! | Stock markets plunge as the West Asia war escalates, with Sensex down | Sakshi
Sakshi News home page

2025-26కు నష్టాల వీడ్కోలు.. బేర్‌ బాజా!

Mar 31 2026 4:34 AM | Updated on Mar 31 2026 8:51 AM

Stock markets plunge as the West Asia war escalates, with Sensex down

సెన్సెక్స్‌ 1,636 పాయింట్లు క్రాష్‌ 

22,350 దిగువకు నిఫ్టీ 

అన్ని రంగాల షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలు 

మహావీర్‌ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు

ముంబై: ఆర్థిక సంవత్సరం 2025–26కు దలాల్‌ స్ట్రీట్‌ నష్టాలతో వీడ్కోలు పలికింది. పశ్చిమాసియా యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించడం, క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో మార్కెట్‌ రెండోరోజూ ‘బేర్‌’ మంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి జీవితకాల కనిష్టానికి పతనం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్‌ 1,636 పాయింట్లు కుప్పకూలి 71,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 488 పాయింట్లు పతనమై 22,331 వద్ద నిలిచింది.  

ఒక దశలో సెన్సెక్స్‌ 1,809 పాయింట్లు 71,774 పాయింట్లు వద్ద, నిఫ్టీ 536 పాయింట్లు క్షీణించి 22,284 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో జపాన్‌ 3%, దక్షిణ కొరియా 3%, తైవాన్‌ 2%, హాంకాంగ్‌ 1% పతనమయ్యాయి. యూరప్‌ మార్కెట్లు 1–0.5% లాభపడ్డాయి. అమెరికా సూచీలు అర శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, దేశీ స్టాక్‌ మార్కెట్‌ 2025–26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7% పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్‌ 5,467 పాయింట్లు, నిఫ్టీ 1,188 పాయింట్లు  పడ్డాయి.  

→ రంగాల వారీ బీఎస్‌ఈ ఇండెక్సుల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ 4.60%, ప్రైవేట్‌ బ్యాంక్స్‌ ఇండెక్స్‌ 3.50%, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ 3.46%, టెలికమ్యూనికేషన్‌ 3.09%, రియల్టీ 3.03% క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 3.13%, 2.14% పతనమయ్యాయి. సెన్సెక్స్‌ సూచీలో పవర్‌గ్రిడ్‌ (0.27%) మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కింది. మిగిలిన 29 షేర్లూ నష్టాలతో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ (–5.09%), ఎస్‌బీఐ (–3.95%), ఇండిగో (–3.80%), బజాజ్‌ఫిన్‌సర్వ్‌ (–3.71%)  అత్యధికంగా నష్టపోయాయి. 

కీలక దశలోకి పశ్చిమాసియా యుద్ధం
ఎన్ని దాడులు చేసినా ఇరాన్‌ లొంగే పరిస్థితి కని్పంచకపోవడంతో అమెరికా ఆఖరి అస్త్రంగా భూతల దాడులు చేయడానికి సిద్ధమైంది. దాడులు జరిపేందుకు 3,500 మంది మెరైన్‌లు, సైనికులతో అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ ట్రిపోలీని పశ్చిమాసియాకు తరలించారు. యూఎస్‌ భూతల దాడులు చేస్తే, ఎదుర్కోడానికి  సిద్ధమేనని ఇరాన్‌ పార్లమెంటరీ స్పీకర్‌ మహమ్మద్‌ బఘర్‌ ఖలీబాఫ్‌ హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధం కీలక దశకు చేరుకోవడంతో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 115 డాలర్లకు చేరుకుంది.   

బ్యాంకింగ్‌ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలు
ఆర్‌బీఐ విధించిన ఫారెక్స్‌ ఆంక్షల ప్రభావంతో బ్యాంకింగ్‌ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ నికర ఓపెన్‌ ఫారెక్స్‌ పొజిషన్‌లను రోజువారీ ట్రేడింగ్‌ ముగిసే సరికి 100 మిలియన్‌ డాలర్లకు పరిమితం చేయాల్సి ఉంటుంది. దీనితో ఆర్బిట్రాజ్‌ పొజిషన్‌ల అన్‌వైండింగ్‌ నేపథ్యంలో డాలర్‌ విక్రయాలు పెరిగే అవకాశముంది. ఏప్రిల్‌ 10 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం రూపాయికి తాత్కాలిక ఊరట ఇచ్చినా, బ్యాంకింగ్‌ షేర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ 4.60 క్షీణించగా, ప్రైవేట్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.50% పతనమైంది.  

ఎక్స్‌పైరీ ఒత్తిడితో తీవ్ర ఊగిసలాట
నిఫ్టీ నెలవారీ ఆప్షన్స్‌ అండ్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లలో మార్పులు చేసుకోవడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. సాధారణంగా నెలవారీ ఎక్స్‌పైరీ నెల చివరి మంగళవారం జరుగుతుంది. అయితే మహావీర్‌ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ సోమవారం నిర్వహించారు. 

ఆగని ఎఫ్‌ఐఐల విక్రయాలు
పశ్చిమాసియా యుద్ధం అయిదో వారంలోకి ప్రవేశించడంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ మరింత ఊపందుకుంది. గడిచిన 20 రోజులుగా ఎఫ్‌ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తుండం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. సోమవారం ఒక్క రోజే రూ.11,163 కోట్లు అమ్మకాలకు పాల్పడటం పతనం తీవ్రతకు నిదర్శనం.

సీఎంపీడీఐ.. లిస్టింగ్‌ నిరాశ
కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్‌ మైన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంపీడీఐ) షేరు లిస్టింగ్‌లో నిరాశపరించింది. ఇష్యూ ధర (రూ.172)తో పోలిస్తే 5.43 శాతం డిస్కౌంటుతో రూ.163 వద్ద లిస్టయ్యింది. మార్కెట్‌ పతనంలో భాగంగా ఒక దశలో 11.45% క్షీణించి రూ.152 ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 10.43% నష్టంతో రూ.154 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.10,999 కోట్లుగా నమోదైంది.

2 రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల ఆవిరి
బేర్‌ ఎటాక్‌తో రెండు రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.412.41 లక్షల కోట్లకు దిగివచి్చంది. తాజాగా సోమవారం ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 23 మధ్య) సెన్సెక్స్‌ 9,339 పాయింట్లు (11.48%) క్షీణించింది.  

Advertisement
 
Advertisement
Advertisement