కష్టకాలంలో శ్రీలంకకు అండగా భారత్..!

Sri Lanka Gets Urgent 500 Million Dollars Indian Loan to Pay For Oil - Sakshi

మన పక్కనే ఉన్న శ్రీలంక దేశం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం కుదిపేస్తుంది. కరోనా మహమ్మారి వల్ల పర్యాటక రంగం దెబ్బతినడంతో ఆ దేశ ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు రోజు రోజుకి తరిగిపోతున్నాయి. దీంతో చమరు, నిత్యావసర సరుకులను దిగుమతి చేసుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో శ్రీలంక, భారత్ సహాయాన్ని కోరింది. అత్యవసర చమురు కొనుగోళ్లకు కోసం 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వాలని శ్రీలంక మనదేశాన్ని ఆశ్రయించింది.  

ఈ విషయంపై గత రెండు వారాలుగా జరుగుతున్న చర్చల తర్వాత భారత్ ఆ దేశానికి 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై కూడా సంతకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. "భారతీయ సరఫరాదారుల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి శ్రీలంకకు ఈ 500 మిలియన్ డాలర్లు ఇచ్చినట్లు" ఒక అధికారి తెలిపారు. అలాగే, భారతదేశం నుంచి అత్యవసరమైన ఆహారం, ఔషధ దిగుమతుల కోసం మరో 1 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ పై చర్చలు జరుగుతున్నాయని ఒక భారతీయ దౌత్యవేత్త తెలిపారు. 

ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు భారీగా పడిపోవడంతో నిత్యావసర సరుకులైన పప్పులు, పంచదార, గోధుమ పిండి ధరలు ఆ దేశంలో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ దేశంలో కరెంట్ కోతలు కూడా ఎక్కువ కావడంతో నిరుద్యోగ రేటు కూడా భారీగా పెరిగిపోతుంది. ఆ దేశంలో ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో రికార్డు స్థాయి 25 శాతానికి చేరుకుంది.ఆ దేశం డబ్బును ఆదా చేయడానికి విదేశీ దౌత్య కార్యాలయాలను కూడా మూసివేసింది. గత సంవత్సరం చివరి నుంచి మూడు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఆ దేశానికి ఇచ్చే క్రెడిట్ రేటింగ్స్ తగ్గించడంతో కొన్ని దేశాలు ఆ దేశానికి అప్పులు ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేస్తున్నాయి. అలాగే, చైనా నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడానికి మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుంది.

(చదవండి: 'మేక్ ఇన్ ఇండియా' కోసం భారీగా కస్టమ్స్ సుంకం మినహాయింపులు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top