EV Fires: ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రమాదాలు.. డీఆర్‌డీవో రిపోర్ట్‌లో షాకింగ్‌ విషయాలు

Shocking Details Reveals Over EV Fires In DRDO Report - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా జరుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రమాదాలు.. వాహనదారుల్లో ఆందోళన రెకెత్తిస్తోంది. మరణాలు సైతం సంభవించడంతో.. కేంద్రం సైతం విషయాన్ని సీరియస్‌గా పరిగణించి దర్యాప్తులకు ఆదేశించింది. ఈ తరుణంలో.. ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రమాదాలపై డీఆర్‌డీవో నివేదికలో షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి. 

ఎలక్ట్రిక్‌ స్కూటర్లు దగ్ధమవుతుండడం వెనక.. ఎండాకాలం సీజన్‌ కారణం కావొచ్చంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి తొలుత. అయితే కారణం అది కాదని డీఆర్‌డీవో తన నివేదికలో వెల్లడించింది.  బ్యాటరీ లోపాలు కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఓ నివేదిక రూపొందించింది. బ్యాటరీ ప్యాక్స్‌ డిజైన్లు, సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ బండ్లను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తన నివేదికలో డీఆర్‌డీవో స్పష్టం చేసింది. 

అంతేకాదు.. ఖర్చు తగ్గించుకునేందుకు లో-గ్రేడ్‌ మెటీరియల్‌ను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించడం.. ప్రమాదాలకు కారణమైందని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. దేశంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, ఈ-మోటర్‌సైకిల్‌ల వినియోగాన్ని 2030 నాటికి 80 శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వరుస ప్రమాదాలు, కంపెనీల వైఖరి ఆ లక్ష్యాన్ని అందుకుంటుందో.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో..  కంపెనీల వైఖరి బయటపడడంపై మంత్రి నితిన్‌ గడ్కరీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top