సెప్టెంబర్‌లో సేవల రంగం భేష్‌ - 13 సంవత్సరాల్లో ఇదే గరిష్టం! | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో సేవల రంగం భేష్‌ - 13 సంవత్సరాల్లో ఇదే గరిష్టం!

Published Fri, Oct 6 2023 7:27 AM

Services Sector Surges In September 13 year high - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం సెప్టెంబర్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ ఆగస్టులో 60.1 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 61కి ఎగసింది. గడచిన 13 సంవత్సరాల్లో ఈ స్థాయికి ఎప్పుడూ ఇండెక్స్‌ పెరగలేదు.  పటిష్ట డిమాండ్‌ పరిస్థితులు, కొత్త బిజినెస్, ఉపాధి అవకాశాలు సేవల రంగానికి దన్నుగా ఉన్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కిట్‌ ఇంటిలిజెన్స్‌లో ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. 

బిజినెస్‌ ఆశావహ దృక్పదం మెరుగుపడుతోందని కూడా ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సేవల రంగం సూచీ వరుసగా 26 నెలల నుంచీ వృద్ధి బాటన కొనసాగుతోంది. దాదాపు 400 మంది సేవల రంగ కంపెనీల ప్రతినిధుల ప్యానల్‌కు పంపిన ప్రశ్నలకు సమాధానాల ప్రాతిపదికన ఈ సూచీ కదలికలు ఉంటాయి.

సేవలు, తయారీ కలిపినా సానుకూలమే..
కాగా, సేవలు, తయారీ రంగాలతో కూడిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ ఆగస్టులో 60.9 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 61కి ఎగసింది. గడచిన 13 సంవత్సరాల్లో చూస్తే, సెప్టెంబర్‌లో భారత్‌ వస్తు, సేవలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఈ తరహా పరిస్థితి ఈ 13 సంవత్సరాల కాలంలో ఇది రెండవసారి. కాగా, ఒక్క తయారీ రంగానికి సంబంధించి ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఆగస్టులో 58.6 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో ఐదు నెలల కనిష్టస్థాయి 57.5కు పడింది. 

ఈ రంగానికి సంబంధించి సెప్టెంబర్‌లో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి నెమ్మదించినట్లు పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానెల్‌లో కొనుగోలు చేసే మేనేజర్‌లకు పంపిన ప్రశ్నాపత్రాల ప్రతిస్పందనల ప్రాతిపదికన ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ పీఎంఐ మదింపు జరుగుతుంది.

నేడు ఆర్‌బీఐ కీలక పాలసీ నిర్ణయాలు 
మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడురోజుల కీలక ద్వైమాసిక సమావేశాలు నేటితో (6వ తేదీ) ముగుస్తున్నాయి.  

ఈ భేటీ కీలక నిర్ణయాలను గవర్నర్‌ మీడియాకు శుక్రవారం  వెల్లడిస్తారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్‌బీఐ ఈ సమావేశాల్లో కూడా యథాతథంగా 6.5 శాతం వద్దే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా నాలుగు ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథ రేటును కొనసాగించినట్లు అవుతుంది.

Advertisement
 
Advertisement