ఫిబ్రవరిలో ‘సేవలు’ సూపర్‌

Services sector posts fastest rise in a year in February - Sakshi

55.3కు బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌

న్యూఢిల్లీ: భారత్‌ సేవల రంగం ఫిబ్రవరిలో మంచి పనితీరును ప్రదర్శించింది. ఇందుకు సంబంధించి బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 55.3గా నమోదయ్యింది. జనవరిలో ఈ సూచీ 52.8 వద్ద ఉంది. డిమాండ్‌ భారీగా పెరగడం దీనికి కారణమని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలీయానా డీ లిమా తెలిపారు. అయితే ఉపాధి కల్పన విషయంలో మాత్రం ఈ రంగం ఇంకా వెనుకబడే ఉండడం గమనార్హం. నిజానికి సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. సూచీ వృద్ధి బాటన కొనసాగడం ఇది వరుసగా ఐదవ నెల. కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకూ సేవల సూచీ క్షీణతలోనే ఉన్న సంగతి తెలిసిందే. తరువాత సూచీ మెరుగుపడినా, ఉపాధి అవకాశాల్లో మాత్రం అంతగా పురోగతి కనిపించడం లేదు.  

సేవలు–తయారీ ఇండెక్స్‌ కూడా ఓకే
సేవలు, తయారీ కలిపిన కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుడ్‌ ఇండెక్స్‌ కూడా జనవరిలో పురోగతి బాటనే నడిచింది. జనవరిలో 55.8గా ఉన్న కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుడ్‌ ఇండెక్స్,  ఫిబ్రవరిలో  57.3 వద్దకు ఎగసింది. ‘‘సేవలు–తయారీ రంగాలు రెండూ కలిపి చూస్తే, ఇండియన్‌ ఎకానమీ మరింత పునరుత్తేజం అవుతోంది. ప్రైవేటు రంగంలో ఉత్పత్తి, క్తొత ఆర్డర్లు పెరిగాయి’’ అని డీ లిమా పేర్కొన్నారు. కాగా, ఒక్క తయారీ రంగాన్ని చూస్తే, మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఫిబ్రవరిలో కొంత మందగించింది.  జనవరిలో ఇండెక్స్‌ 57.7 వద్ద ఉంటే, ఫిబ్రవరిలో 57.5కు తగ్గింది. అయితే తయారీకి సంబంధించి పీఎంఐ సూచీ 50పైన కొనసాగడం ఇది వరుసగా ఏడవ నెల.  వరుసగా 36 నెలలు సూచీ 50 పైన వృద్ధి ధోరణిలోనే కొనసాగిన తయారీ, కరోనా కఠిన లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో 50 పాయింట్ల దిగువకు క్షీణతలోకి జారిపోయింది. తిరిగి ఆగస్టులోనే వృద్ధి బాటకు వచ్చింది. ఉపాధి కల్పనలో మాత్రం అటు తయారీ ఇటు సేవల రంగాలు రెండూ వెనుకబడే ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top