ఆరంభం అదిరింది

Sensex starts 2022 with a bang, gains 929 points to 59,000 - Sakshi

కొత్త ఏడాదికి లాభాలతో స్వాగతం

మూడు వారాల్లో అతిపెద్ద లాభం

సెన్సెక్స్‌ లాభం 929 పాయింట్లు

271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ఫార్మా షేర్లకు మాత్రమే నష్టాలు

ముంబై:  కొత్త ఏడాది తొలిరోజు కొనుగోళ్లతో స్టాక్‌ మార్కెట్‌ కళకళలాడింది. దీంతో సూచీలు ఈ ఏడాది(2022)కి లాభాలతో స్వాగతం పలికాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మన మార్కెట్లు సానుకూలతలను అందిపుచ్చుకున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. దేశీయంగా డిసెంబర్‌ జీఎస్‌టీ వసూళ్లు, నెలవారీ వాహన విక్రయ గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదయ్యాయి.

డాలర్‌ మారకంలో రూపాయి రికవరీ కలిసొచ్చింది. దేశంలో అందరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు మార్కెట్‌ వర్గాలను మెప్పించాయి. ఈ పరిణామాలతో ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్నా.., ఇన్వెస్టర్లు రిస్క్‌ వైఖరి ప్రదర్శిస్తూ కొనుగోళ్లకే మొగ్గుచూపారు. ఫలితంగా సోమవారం సెన్సెక్స్‌ 929 పాయింట్లు పెరిగి డిసెంబర్‌ 13వ తేదీ తర్వాత తొలిసారి 59వేల స్థాయి పైన 59,183 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 271 పాయింట్లు ర్యాలీ చేసి 17,626 వద్ద నిలిచింది. తద్వారా మూడు వారాల్లో సూచీలు అతిపెద్ద లాభాన్ని ఆర్జించాయి. అలాగే సూచీలకిది రెండో రోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ రంగ షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్‌ సూచీలో మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్న బ్యాంకింగ్‌ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరిగాయి.

చిప్‌ కొరత కష్టాలను అధిగమిస్తూ వాహన కంపెనీలు పరిశ్రమ అంచనాలకు మించి అమ్మకాలను సాధించడంతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.903 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.803 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడే నష్టాలను రికవరీ చేసుకొని రూపాయి మూడు పైసలు బలపడి 74.26 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఆర్థిక రివకరీ ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఏడాది తొలి సెషన్‌లో లాభాల బాటపట్టాయి. బ్రిటన్, చైనా, జపాన్‌ ఆస్ట్రేలియా మార్కెట్లకు సెలవు. గతేడాదిలో 27 శాతం లాభాల్ని పంచిన అమెరికా మార్కెట్లు అదే జోష్‌ను కనబరుస్తూ లాభాలతో కదలాడుతున్నాయి.  

రోజంతా లాభాలే...
స్టాక్‌ సూచీలు 2022 ఏడాది తొలి రోజు ట్రేడింగ్‌ను లాభాలతో మొదలుపెట్టాయి. సెన్సెక్స్‌ 56 పాయింట్ల లాభంతో 58,310 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 17,387 వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి విస్తృత కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,012 పాయింట్లు ర్యాలీ చేసి 59,266 వద్ద, నిఫ్టీ 293 పాయింట్లు దూసుకెళ్లి 17,647 వద్ద గరిష్టాల తాకాయి. ఇవి సూచీలకు ఆరు వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ చివరిదాకా కొనుగోళ్లకే కట్టబడటంతో సూచీలు ఏ దశలో వెనకడుగు వేయలేదు.

రూ.3.49 లక్షల కోట్ల సంపద సృష్టి  
స్టాక్‌ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ చేయడంతో కొత్త ఏడాది తొలి రోజు రూ.3.49 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ.269 లక్షల కోట్లుగా నమోదైంది.  ‘వ్యాక్సిన్‌ వేగవంతం చర్యల నుంచి బుల్‌ జోష్‌ను అందిపుచ్చుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. కోవిడ్‌ సంబంధిత వార్తలు, ప్రపంచ మార్కెట్ల తీరు రానున్న రోజుల్లో సూచీ ల గమనాన్ని నిర్దేశిస్తాయి. మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్‌ ఇండెక్స్‌ వరుసగా మూడో రోజూ బలపడటం ఆందోళన కలిగిస్తోంది. నిఫ్టీ సాంకేతికంగా అప్‌ట్రెండ్‌లో 17,750 స్థాయి వద్ద కీలక నిరోధం ఉండొచ్చు’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఎస్‌ రంగనాథన్‌ తెలిపారు.

మార్కెట్లో మరిన్ని సంగతులు
n డిసెంబర్‌లో ఉత్పత్తి పెరిగిందనే కంపెనీ ప్రకటనతో కోల్‌ ఇండియా షేరు ఆరు శాతానికి పైగా లాభపడి రూ.155 వద్ద స్థిరపడింది.  
n ఎన్‌సీడీల ద్వారా రూ.456 కోట్లను సమీకరించడంతో ఎడెల్వీజ్‌ ఫైనాన్షియల్‌ షేరు ఐదుశాతం పెరిగి రూ.75 వద్ద ముగిసింది.  
n ఐటీ షేర్లలో భాగంగా టీసీఎస్‌ షేరు రాణించింది. బీఎస్‌ఈలో రెండు శాతం లాభపడి రూ.3,818 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రెండున్నర ర్యాలీ చేసి రూ.3829 వద్ద 13 వారాల గరిష్టాన్ని అందుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top