మళ్లీ రికార్డుల ర్యాలీ..!

Sensex jumps 228 points, Nifty ends above 15,750 - Sakshi

కొత్త గరిష్టాలపై సెన్సెక్స్, నిఫ్టీ ముగింపు 

ఇంధన, ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు

ఫార్మా, మెటల్‌ షేర్లలో లాభాల స్వీకరణ

ముంబై: ఒకరోజు విరామం తర్వాత స్టాక్‌ మార్కెట్లో మళ్లీ కొత్త రికార్డులు నమోదయ్యాయి. మిడ్‌సెషన్‌ నుంచి ఇంధన, ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారం సూచీలు సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్‌ 228 పాయింట్లు లాభపడి 52,328 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు సూచీకి జీవితకాల గరిష్టస్థాయి. అంతకు ముందు సెన్సెక్స్‌కు (జూన్‌ 03న) జీవితకాల గరిష్ట ముగింపు స్థాయి 52,232గా ఉంది. ఇక నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 15,752 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 103 పాయింట్లు ర్యాలీ చేసి 15,773 స్థాయిని అందుకుంది. ముగింపు, ఇంట్రాడే స్థాయిలు నిఫ్టీకి జీవితకాల గరిష్టాలు కావడం విశేషం.

చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో మూడేళ్ల తర్వాత నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఆల్‌టైం హైని నమోదు చేయగా, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ మరోసారి జీవితకాల గరిష్టం వద్ద ముగిసింది. మెటల్, ఫార్మా, ఆర్థిక, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. సూచీల రికార్డు ర్యాలీ తిరిగి మొదలవడంతో సోమవారం ఒక్కరోజే రూ.1.81 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రికార్డు స్థాయి రూ.229 లక్షల కోట్లకు చేరింది. గత శుక్రవారం విడుదలైన అమెరికా నిరుద్యోగ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడంతో ప్రపంచ మార్కెట్లు పరిమిత శ్రేణిలో కదలాడుతున్నాయి.

‘‘దేశంలో కరోనా కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాలు కోవిడ్‌ ఆంక్షలను సడలించడం కలిసొచ్చింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ర్యాలీ కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది. నిఫ్టీకి 15,500–15,600 స్థాయిలో బలమైన మద్దతు ఉంది. అందుకే ట్రేడింగ్‌ ప్రారంభంలో అమ్మకాల ఒత్తిడి కలిగినా తట్టుకోగలిగింది. మార్కెట్లో బుల్లిష్‌ ట్రెండ్‌ కొనసాగే అవకాశం ఉన్నందున నిఫ్టీ 16,000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు’’ అని దీన్‌ దయాళ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్టాక్‌ నిపుణుడు మనీష్‌ హతీరమణి తెలిపారు.

ఇంట్రాడేలో ట్రేడింగ్‌ జరిగిందిలా!
ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 131 పాయింట్ల లాభంతో 52,231 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 15,725 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భారీ ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఉదయం లాభాలన్నీ కోల్పోయాయి. అయితే మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్ల లాభాల ప్రారంభం సూచీలకు ఉత్సాహాన్నిచ్చింది. అలాగే సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని వార్తలు వెలువడటంతో తిరిగి కొనుగోళ్లు మొదలయ్యాయి. ద్వితీయార్థంలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో ఒక దశలో నిఫ్టీ 103 పాయింట్లు ర్యాలీ చేసి 15,773 స్థాయిని అందుకుంది. సెన్సెక్స్‌ 279 పాయింట్లు లాభపడి 52,379 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top