మార్కెట్‌ మళ్లీ లాభాల బాట...

Sensex gains over 448 points and Nifty ends above 11,850 points - Sakshi

సెనెక్స్‌ లాభం 449 పాయింట్లు

11,850 పైన ముగిసిన నిఫ్టీ 

రాణించిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు

కలిసొచ్చిన అంతర్జాతీయ సానుకూలాంశాలు

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ మళ్లీ లాభాల పట్టాలెక్కింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌ 449 పాయింట్లు పెరిగి.. తిరిగి 40 వేల పైన 40,432 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 111 పాయింట్లను ఆర్జించి 11,873 వద్ద ముగిసింది. ఈ ఏడాది చివరికల్లా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. పడిపోయిన క్రూడాయిల్‌ ధరలు కూడా మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. చిన్న, మధ్య తరహా షేర్ల కౌంటర్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. మరోవైపు అటో, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్‌ఐఐలు రూ.1656.78 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.1621.73 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.  ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు డిమాండ్‌ నెలకొనడం సూచీలకు కలిసొచ్చింది.

పీఎస్‌యూ షేర్లకు బైబ్యాక్‌ బూస్టింగ్‌...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, ఎన్‌ఎమ్‌డీసీ, ఇంజనీరింగ్స్‌ ఇండియాతో సహా మొత్తం 8 కంపెనీలను బైబ్యాక్‌ ప్రక్రియను చేపట్టాల్సిందిగా కేంద్రం కోరినట్లు వచ్చిన వార్తలతో ఇంట్రాడేలో పీఎస్‌యూ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. గెయిల్‌ 4 శాతానికి పైగా లాభపడింది. కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ షేర్లు 3 నుంచి 2 శాతంతో స్థిరపడ్డాయి. బీఎస్‌ఈలో పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.50 శాతం లాభంతో ముగిసింది.  

ఎగసి‘పడిన’ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు...  
మెరుగైన క్యూ2 ఫలితాల ప్రకటనతో భారీ లాభంతో మొదలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు మార్కెట్‌ ముగిసేసరికి 0.35% స్వల్ప లాభంతో రూ.1203.55 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు...
చైనా సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక వృద్ధి గణాంకాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. కరోనా పతనం నుంచి వేగంగా రికవరీని సాధిస్తూ ఈ త్రైమాసికపు ఆర్థిక వృద్ధి 4.9%గా నమోదైంది. ఫలితంగా సోమవారం ఆసియా మార్కెట్లు 1.5% పైగా లాభంతో ముగిశాయి. అయితే చిత్రంగా చైనా మార్కెట్‌ అరశాతం నష్టపోయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top