ఈ పథకంతో సీనియర్‌ సిటిజన్స్‌కు రూ.20 వేల వరకు రాబడి!

senior citizen savings scheme - Sakshi

సీనియర్‌ సిటిజన్ల పొదుపునకు సంబంధించి ఓ అద్భుతమైన పథకం ఉంది. దాని పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. దీని కింద సంవత్సరానికి 8 శాతం వడ్డీ లభిస్తుంది. మదుపు సొమ్ము 5 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు.

సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023 బడ్జెట్ సందర్భంగా పేర్కొన్నారు . అయితే దీనిపై అధికారిక నోటిఫికేషన్‌ రావాల్సి ఉంది. 

ఈ పథకంలో రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా  సీనియర్ సిటిజన్లు వడ్డీ కింద నెలకు రూ. 20,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఒక వేళ భార్యాభర్తలిద్దరూ కలిపి డిపాజిట్‌ చేస్తే నెలకు రూ. 40,000 వరకు రాబడి లభిస్తుంది.

వడ్డీ రేటు మరింత పెరిగేనా?
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ప్రభుత్వం మరింత పెంచవచ్చని సీనియర్ సిటిజన్లు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా జరగనున్న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల తదుపరి సవరణను దృష్టిలో ఉంచుకుని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ వడ్డీ రేటును ప్రభుత్వం పెంచుతుందని ఆశిస్తున్నారు. 

2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అంటే డిసెంబర్‌లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును మార్చింది. ప్రస్తుతం ఇది 8 శాతంగా ఉంది. అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు మరింత పెరిగే అవకాశం లేదని ఎస్‌ఏజీ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా చెబుతున్నారు. 

మై ఫండ్‌ బజార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో వినిత్ ఖండారే కూడా ఈ వడ్డీ రేటు మరింత పెంచే అవకాశం లేదన్నారు. గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌ దిగుబడిలో పెరుగుదల కారణంగా ప్రభుత్వం స్వల్పకాలిక చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును పెంచవచ్చని భావిస్తున్నప్పటికీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ఇటీవలే సవరించిన నేపథ్యంలో మరో సారి సవరణ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top