ఇన్వెస్టర్ల రిఫండ్స్‌కు సెబీ రెడీ

Sebi: Over 12 Lakh Pacl Investors Money Refund - Sakshi

పీఏసీఎల్‌ కేసులో తాజా చర్యలు 

రూ. 10,001–15,000 మధ్య వాపస్‌

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పీఏసీఎల్‌ అక్రమ పథకాల అంశంలో ఇన్వెస్టర్లకు రిఫండ్స్‌ను అందించే చర్యలు ప్రారంభించింది. ఇందుకు జూన్‌ 30లోగా అసలు పత్రాలను(ఒరిజనల్‌ సర్టిఫికెట్లు) దాఖలు చేయవలసి ఉంటుందని ఇన్వెస్టర్లకు తెలియజేసింది. మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎం లోధా అధ్యక్షతన సెబీ నియమించిన అత్యున్నత కమిటీ నుంచి ఎస్‌ఎంఎస్‌ అందుకున్న ఇన్వెస్టర్లకు మాత్రమే ఈ పథకమని సెబీ తెలియజేసింది. రూ. 10,001 మొదలు రూ. 15,000 వరకూ సొమ్మును ఆశిస్తున్న ఇన్వెస్టర్లకు మాత్రమే ఈ అవకాశమని స్పష్టం చేసింది. ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఈ ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30వరకూ అనుమతించనున్నట్లు వెల్లడించింది. పెరల్‌ గ్రూప్‌గా పేరున్న పీఏసీఎల్‌ కేసులో ఇన్వెస్టర్ల సొమ్మును వాపసు చేయమంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సెబీ నిధుల వాపస్‌ చర్యలకు ఉపక్రమించింది.  

ఇప్పటికే షురూ 
సెబీ ఏర్పాటు చేసిన కమిటీ పీఏసీఎల్‌ ఆస్తులను విక్రయించడం ద్వారా ఇప్పటికే రిఫండులకు శ్రీకారం చుట్టింది. ఇన్వెస్టర్ల వివరాలను ధ్రువపరచుకున్నాక దశలవారీగా సొమ్మును వాపసు చేయనుంది. వ్యవసాయం, రియల్టీ బిజినెస్‌ల పేరుతో పెరల్‌ గ్రూప్‌ ప్రజల నుంచి నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే. చట్టవిరుద్ధ కలెక్టివ్‌ పెట్టుబడి పథకాల(సీఐఎస్‌) ద్వారా పీఏసీఎల్‌ రూ. 60,000 కోట్లు సమీకరించినట్లు సెబీ గుర్తించింది. సొమ్ము వాపసును ఆశిస్తున్న ఇన్వెస్టర్లు ముంబైలోని సెబీ ప్రధాన కార్యాలయానికి ఒరిజనల్‌ పత్రాలను పంపించవలసి ఉంటుంది. ఇన్వెస్టర్ల సొమ్ము రిఫండ్‌ చేయడంలో వైఫల్యంతో 2015 డిసెంబర్‌లో సెబీ పీఏసీఎల్‌ గ్రూప్‌సహా.. తొమ్మిదిమంది ప్రమోటర్లు, డైరెక్టర్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌ను చేపట్టింది.

     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top