ఫ్రాంక్లిన్‌ ఏఎంసీ, ఉద్యోగులపై భారీ జరిమానా

Sebi Has Fined Rs 3 Crore On Franklin Templeton Trustee Services   - Sakshi

∙   డెట్‌ ఫండ్స్‌ విషయంలో నిబంధనల ఉల్లంఘన 

∙  రూ.15 కోట్లు విధించిన సెబీ 

న్యూఢిల్లీ: డెట్‌ ఫండ్స్‌ విషయంలో నిబంధనలకు పాతరేసిన ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ (ఏఎంసీ)పై, సీనియర్‌ ఉద్యోగులు, ట్రస్టీలపై సెబీ రూ.15 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2020 ఏప్రిల్‌లో ఈ సంస్థ ఆరు డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలను రాత్రికి రాత్రే మూసివేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఫలితంగా రూ.25వేల కోట్ల మేర ఇన్వెస్టర్ల పెట్టుబడులు చిక్కుకుపోయాయి. ఈ విషయమై దర్యాప్తు నిర్వహించిన సెబీ.. ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ట్రస్టీ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌పై రూ.3 కోట్లు, ఫ్రాంక్లిన్‌ ఏఎంసీ ప్రెసిడెంట్‌ సంజయ్‌ సప్రే, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సంతోష్‌ కామత్‌ ఒక్కొక్కరూ రూ.2 కోట్ల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

అలాగే ఫండ్‌ మేనేజర్లు కునాల్‌ అగర్వాల్, పల్లబ్‌ రాయ్, సచిన్‌ పద్వాల్‌దేశాయ్, ఉమేశ్‌ శర్మ, మాజీ ఫండ్‌ మేనేజర్‌ సుమిత్‌ గుప్తా 1.5 కోట్లు చొప్పున చెల్లించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. అలాగే ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ సౌరభ్‌ గంగ్రేడ్‌కు రూ.50 లక్షల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా ఈ మొత్తాలను చెల్లించాలని ఆదేశించింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలో లోపాలు జరగకుండా చూడడంలో వీరంతా విఫలమైనట్టు.. విధుల నిర్వహణ యూనిట్‌ హోల్డర్ల ప్రయోజనాలను కాపాడే విధంగా లేవని తేలి్చంది. ఈ ఆదేశాలతో తాము విభేదిస్తున్నామని.. సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో సవాలు చేస్తామని ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ అధికార ప్రతినిధి ప్రకటించారు.  

చదవండి: ధరలకు ఇంధన సెగ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top