సోషల్‌ స్టాక్‌ ఎక్స్చేంజీలకు మార్గదర్శకాలు | Sakshi
Sakshi News home page

సోషల్‌ స్టాక్‌ ఎక్స్చేంజీలకు మార్గదర్శకాలు

Published Tue, Sep 20 2022 6:15 AM

Sebi comes out with framework for social stock exchange - Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపాదిత సోషల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీ (ఎస్‌ఎస్‌ఈ)కి సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం విడుదల చేసింది. ఈ ఎక్సే్చంజీలో నమోదు చేసుకునేందుకు ఉండాల్సిన అర్హతా ప్రమాణాలు, వెల్లడించాల్సిన వివరాలు మొదలైన అంశాలను ఇందులో పొందుపర్చింది.

లాభాపేక్ష లేని సంస్థలు (ఎన్‌పీవో) నిధులు సమీకరించుకునేందుకు అదనపు మార్గాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది జులైలో సెబీ కొన్ని నిబంధనలు ప్రతిపాదించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సమీకరించిన నిధుల వినియోగం గురించిన వివరాలను త్రైమాసికం ముగిసిన నాటి నుంచి 45 రోజుల్లోగా ఎస్‌ఎస్‌ఈకి ఎన్‌పీవో తెలియజేయాలి. అలాగే ఆర్థిక సంవత్సరం ముగిసిన 90 రోజుల్లోగా సదరు నిధుల వినియోగంతో సాధించిన సామాజిక ప్రయోజనాల వివరాలను (ఏఐఆర్‌)ను కూడా సమర్పించాలి.  

మరిన్ని వివరాలు ..
► చారిటబుల్‌ ట్రస్టుగా ఎన్‌పీవో నమోదై ఉండాలి. కనీసం మూడేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తుండాలి. క్రితం ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 10 లక్షల నిధులు సమీకరించుకుని, రూ. 50 లక్షల మేర వ్యయాలు చేసినదై ఉండాలి.
► అత్యధికంగా విరాళాలిచ్చిన టాప్‌ 5 దాతలు, ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడించాలి. బడ్జెట్, కార్యకలాపాల స్థాయి, ఉద్యోగులు.. వాలంటీర్ల సంఖ్య, ప్రోగ్రామ్‌వారీగా నిధుల వినియోగం మొదలైనవి తెలియజేయాలి.
► నియంత్రణ సంస్థ నిర్దేశించిన 16 అంశాల్లో ఏదో ఒక దానిలో ఎన్‌పీవో కార్యకలాపాలు సాగిస్తున్నదై ఉండాలి. పేదరికం, అసమానతలు, పౌష్టికాహార లోపం మొదలైన వాటి నిర్మూలన, విద్య.. ఉపాధి కల్పనకు తోడ్పాటునివ్వడం మొదలైన అంశాలు వీటిలో ఉన్నాయి.
► అఫోర్డబుల్‌ హౌసింగ్‌ సంస్థలు తప్ప కార్పొరేట్‌ ఫౌండేషన్లు, రాజకీయ లేదా మతపర కార్యకలాపాలు సాగించే సంస్థలు, ట్రేడ్‌ అసోసియేషన్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అలాగే హౌసింగ్‌ కంపెనీలను సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌గా గుర్తించరు.


స్టాక్‌ బ్రోకర్ల కట్టడికి నిబంధనలు..
క్లయింట్ల సెక్యూరిటీలు, నిధులను స్టాక్‌ బ్రోకర్లు దుర్వినియోగం చేయకుండా నివారించేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం క్లయింట్ల డీమ్యాట్‌ ఖాతాల్లో నుంచి సెక్యూరిటీలను ట్రేడింగ్‌ మెంబరు పూల్‌ ఖాతాల్లోకి బదలాయించడాన్ని డిపాజిటరీలు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. నవంబర్‌ 25 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.

Advertisement
Advertisement