యూపీఐ లావాదేవీల్లో ఎస్‌బీఐ, పేటీఎం, ఫోన్‌పే టాప్‌

SBI, Paytm Payments Bank, PhonePe Lead In UPI Transactions In February - Sakshi

న్యూఢిల్లీ: యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై అత్యధిక లావాదేవీల రికార్డును ఫిబ్రవరి నెలలో ఎస్‌బీఐ నమోదు చేసింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు, ఫోన్‌పే కూడా పలు విభాగాల్లో అగ్రగామిగా నిలిచాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ గణాంకాల ప్రకారం.. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై యాప్‌ ఆధారిత లావాదేవీలు, విలువ పరంగా ఎక్కువ నమోదు చేసింది ఫోన్‌పే. యాప్‌ విభాగంలో ఫోన్‌పే ద్వారా 975.53 మిలియన్‌ యూపీఐ చెల్లింపుల లావాదేవీలు జరిగాయి. ఎస్‌బీఐ 652.92 మిలియన్ల రెమిటెన్స్‌ లావాదేవీలను ఫిబ్రవరిలో నమోదు చేసింది.

భీమ్‌ యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ఇకమీదట ఫిర్యాదుల స్వీకరణ
కాగా, డిజిటల్‌  లావాదేవీలకు భీమ్‌ యూపీఐ యాప్‌ను వినియోగించే వారు తమ పెండింగ్‌ (అపరిష్కృత) లావాదేవీల వివరాలను పరిశీలించుకోవడంతోపాటు, ఫిర్యాదులను దాఖలు చేసుకోవచ్చని ఎన్‌పీసీఐ ప్రకటించింది. కస్టమర్‌ అనుకూల, పారదర్శక ఫిర్యాదుల పరిష్కార విధానం ఉండాలన్న ఆర్‌బీఐ విధానంలో భాగమే నూతన సదుపాయమని పేర్కొంది. భీమ్‌ యూపీఐ యాప్‌పై యూపీఐ–హెల్ప్‌ ఆప్షన్‌ నుంచి ఈ సదుపాయాలను పొందొచ్చని తెలిపింది. ప్రస్తుతానికి ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top